ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో వీరి భవిష్యత్తు చదువుల కోసం కొత్తగా మరో 7 ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్యలో పెద్ద దారిని చూపనుందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ–నీట్ కోచింగ్ సెంటర్ల సాయంతో ఈ ఏడాది ఐఐటీ, నీట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వారిలో 55 మంది విద్యార్థులను చంద్రబాబు సచివాలయంలో స్వయంగా అభినందించి, ఒక్కొక్కరికి రూ.1 లక్ష ప్రోత్సాహకంతో పాటు జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థుల కృషి, ప్రతిభను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “మట్టిలో మాణిక్యాలు మెరుస్తాయి, సరైన అవకాశం ఇస్తే మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడగలరు” అని అన్నారు. కార్పొరేట్ కాలేజీలలో ఇచ్చే శిక్షణకు తగ్గట్టే గురుకులాల్లోనూ స్పెషల్ కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల విజయాలు మరింత మందికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.