ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. 16వ శాసనసభ నాలుగో సెషన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి 48వ సెషన్ కూడా ప్రారంభం అవుతుంది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ మేరకు అనుమతి ఇవ్వగా, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సమావేశాలు 7 నుంచి 10 పనిదినాలపాటు కొనసాగే అవకాశం ఉంది.
మొదటి రోజున అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాల కాలపరిమితి, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టనుంది. అదనంగా మరికొన్ని కొత్త బిల్లులను కూడా సభలో ఉంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ సమావేశాల్లో వైసీపీ హాజరుపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ సభ్యులు ఈసారి హాజరవుతారా అన్నదానిపై ఆసక్తి పెరిగింది. హాజరుకాని పక్షంలో అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని చర్చ సాగుతోంది. అయితే, వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సమావేశాలకు వస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి, వైసీపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.