Differently Abled: మార్కాపురంలో దివ్యాంగులకు ఉచిత త్రీ వీలర్ బైక్‌ల పంపిణీ!

Differently Abled: మార్కాపురంలో దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి శనివారం మార్కాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ మోటార్ బైక్‌లను పంపిణీ చేశారు.

Published : 2026-05-23 21:11:00

దివ్యాంగుల సంక్షేమంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందే: మంత్రి డోలా..

రూ.17.5 కోట్లతో 1750 మంది దివ్యాంగులకు ఉచిత బైక్‌లు..

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వ పథకాలు..

మార్కాపురంలో దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి శనివారం మార్కాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ మోటార్ బైక్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం విషయంలో ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.17.5 కోట్ల వ్యయంతో 1750 మంది దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ బైక్‌లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ వాహనాలు వారి రోజువారీ జీవితంలో స్వావలంబనకు ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు.

దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించిన మంత్రి, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. “దివ్యాంగ శక్తి” పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు.

అదే విధంగా రాష్ట్రంలోని దివ్యాంగ హాస్టళ్ల మరమ్మతులకు రూ.4.38 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. బాపట్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, విశాఖపట్నంలో రూ.200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

ప్రతి జిల్లాలో “దివ్యాంగ భవన్” నిర్మాణం చేపడతామని, ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసి త్వరలో నియామక పత్రాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టరేట్లలో దివ్యాంగులకు సౌకర్యంగా ప్రత్యేక లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే “ఇంద్రధనస్సు” హామీలన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేసిన మంత్రి, విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా “డిసబుల్ కమిషన్” ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో దీనికి పూర్తి స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పారు. అలాగే ప్రతి జిల్లాలో ఆటిజం సెంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్యులను నియమించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల – వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ జి.నారాయణస్వామి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, ఆర్డీవో ప్రభాకర్, డిజేబుల్ వెల్ఫేర్ ఏడి సువార్తమ్మ, జనసేన నాయకుడు ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వారి కుటుంబాల్లో ఆశలు నింపుతోందని, సమాజంలో మరింత గౌరవంగా జీవించే అవకాశం కల్పిస్తోందని కార్యక్రమానికి హాజరైన పలువురు అభిప్రాయపడ్డారు.

Spotlight

Read More →