ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని జాతీయ రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానించే దిశగా కీలక అడుగు వేసింది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి అయిన ఎన్‌హెచ్–16తో అమరావతిని కలపడానికి ఈ–13 రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు ప్రతిపాదించిన ఈ రోడ్డును ఇప్పుడు నేషనల్ హైవే 16 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
యర్రబాలెం నుంచి ఎన్‌హెచ్–16 వరకు సుమారు 3.54 కిలోమీటర్ల మేర ఈ–13 రహదారిని పొడిగించనున్నారు. ఈ రోడ్డు విజయవాడ–మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారితో కలుస్తుంది. ఈ పొడిగింపు పనులు కూడా ఆరు వరుసల రహదారిగానే చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును రూ.384 కోట్ల అంచనా వ్యయంతో ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాజధాని అమరావతి పనులు 2024లో మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో, నగరానికి బయటి ప్రాంతాలతో బలమైన రవాణా అనుసంధానం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ–13 రహదారిని ఎన్‌హెచ్–16 వరకు పొడిగిస్తున్నారు. ఈ రోడ్డు గుంటూరు, అమరావతి, విజయవాడ మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది.
ఈ రహదారి నిర్మాణం ప్రత్యేక డిజైన్‌తో చేపడుతున్నారు. యర్రబాలెం నుంచి మొదట ఏటవాలుగా రోడ్డు, ఆ తర్వాత ఎలివేటెడ్ కారిడార్, రైల్వే లైన్‌పై రైల్ ఓవర్ బ్రిడ్జి, మళ్లీ ఎలివేటెడ్ మార్గం, కొండలపై ఘాట్ రోడ్డు, లోయలపై ఎలివేటెడ్ కారిడార్ వంటి విభిన్న నిర్మాణాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఈ విధంగా ప్రకృతి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రోడ్డును డిజైన్ చేశారు.
చివరగా జాతీయ రహదారిని దాటేందుకు 5.5 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్‌తో పాటు ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను నిర్మించనున్నారు. ఈ ట్రంపెట్ ద్వారా అమరావతి నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు సులభంగా జాతీయ రహదారిపైకి చేరగలుగుతాయి. ఈ రోడ్డు పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, రాజధాని అమరావతికి మరింత మెరుగైన రవాణా అనుసంధానం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.