దేశంలో ఐటీ రంగంలో మందగమనం, ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ (Cap Gemini) ఆశాజనక ప్రకటన చేసింది. భారతదేశంలోనే ఈ ఏడాది (2025లో) 40,000 నుంచి 45,000 మందిని నియమించబోతున్నట్లు సంస్థ CEO అశ్విన్ యార్డి తెలిపారు. ఈ ప్రకటన, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది అభ్యర్థులకు శుభవార్తగా మారింది.
ఈ నియామకాలలో సుమారు 35-40 శాతం లేటరల్ హైరింగ్ ఉండబోతుందని క్యాప్‌జెమినీ వెల్లడించింది. అంటే ఇప్పటికే ఐటీ రంగంలో అనుభవం ఉన్నవారికి పెద్ద ఎత్తున అవకాశాలు లభించనున్నాయి. బలమైన టెక్నికల్ నైపుణ్యం, ప్రాజెక్ట్ అనుభవం ఉన్నవారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇటీవలే క్యాప్‌జెమినీ, ప్రముఖ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీ WNS (Holdings)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ విలీనంతో పాటు సంస్థ సేవల పరిధి మరింత విస్తరించనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఉద్యోగ నియామకాలు చేపడుతూ సంస్థకు మానవ వనరుల బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్తగా నియమితులయ్యే అభ్యర్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ (ట్రైనింగ్) ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. ఉద్యోగుల నైపుణ్యాలు నూతన తరం టెక్నాలజీలకు అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు ఇది కీలక నిర్ణయంగా భావించబడుతోంది.
ఇటీవల కొన్ని కంపెనీలు నియామకాల విషయంలో జాప్యం చేయడం, ఆఫర్లను వాయిదా వేయడం వల్ల నిరుద్యోగుల ఆత్మవిశ్వాసం దెబ్బతినగా, క్యాప్‌జెమినీ ప్రకటన ఎదురుచూస్తున్న వారి కోసం ఒక నూతన ఆశ చూపుతోంది. IT రంగంలో ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులు తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకుంటూ, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.