భారతీయ హిందు సాంప్రదాయ పండగలన్నీ తిధులతోను, నక్షత్రాల తో ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి... మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్నరోజును మహా శివరాత్రిగా పరిగణింపబడునని శాస్త్రగ్రంధాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకొవాలని శాస్త్ర నిర్ణయము.
సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం.
శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి. మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిదర పోకుండా (జాగరణ) తో మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. ఇది హిందువులకు అత్యంత పుణ్య ప్రదమైన పర్వదినం రోజు.
మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి.
1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.
లింగోద్భవ కధ
శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కధ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ, విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారిరువురిలో ఎవరు గొప్పో అని తేల్చుకోవలనుకున్నారు. ఆ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్ధశి తిధి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు.
బ్రహ్మ,విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆశివుని యొక్క ఆది, అంతం తెలుసుకోవలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరుగడం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు ఏదో చివర ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు.
చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగా... శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గోప్ప అనే పోటీతో వాదోప వాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు. అపుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు.ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కధనం.
మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో గనక శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.
శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివున్ని బోళాశంకరుడని పేరు. భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివ నామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభఫలితాలు పొందుతారు అని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి.
మీ అందరి పైన ఆ శివయ్య కృప ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రవాసి తరుపున శివరాత్రి శుభాకాంక్షలు.
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి