దీపావళి అంటే వెలుగుల పండుగ మాత్రమే కాదు, షాపింగ్ సీజన్‌కి స్టార్ట్ సిగ్నల్ కూడా! ఈ సమయంలో కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు, ఇంటి సామాన్లు కొనడం అనేది చాలామందికి ఆనందాన్నిస్తుంది. మార్కెట్లో పెద్ద షాపింగ్ మూడ్ నెలకొంటుంది. ఈ సీజన్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ముఖ్యంగా బ్యాంకులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపులు ఇస్తుంటాయి. కానీ ప్రశ్న ఏంటంటే — ఈ పండుగ సీజన్లో షాపింగ్ చేయడానికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ — దేనితో చెల్లిస్తే లాభం? చూద్దాం!
డెబిట్ కార్డు అంటే మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా డబ్బు తీసుకునే పేమెంట్ మోడ్. మీ దగ్గర ఉన్న మొత్తానికే ఖర్చు చేయడం వల్ల అప్పులు లేకుండా బడ్జెట్లో ఉండే వారికి ఇది మంచి ఎంపిక. డెబిట్ కార్డులకు వడ్డీ ఛార్జీలు ఉండవు, కాబట్టి తక్షణ చెల్లింపులకు, రోజువారీ షాపింగ్‌కు ఇవి అనుకూలం. అయితే క్రెడిట్ కార్డులతో పోలిస్తే రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు పరిమితంగా ఉంటాయి. ఈ-కామర్స్ సైట్లలో మాత్రం బ్యాంకులు పండుగ ఆఫర్లను ఇస్తున్నాయి. ఉదాహరణకు, SBI, యాక్సిస్, RBL బ్యాంకులు తమ డెబిట్ కార్డులపై 10% వరకు తక్షణ తగ్గింపులు ఇస్తున్నాయి. చిన్న షాపింగ్‌లు, రోజువారీ ఖర్చులకు డెబిట్ కార్డు ఉత్తమమైన ఎంపిక.
క్రెడిట్ కార్డులు మీకు ఒక నిర్దిష్ట పరిమితి వరకు డబ్బు అప్పుగా తీసుకునే అవకాశం ఇస్తాయి. మీరు తర్వాత చెల్లిస్తారు. ఇవి పండుగ సీజన్లో అత్యధికంగా ఉపయోగించే పేమెంట్ మోడ్. ఎందుకంటే చాలా బ్యాంకులు క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు, EMI ఆఫర్లు అందిస్తాయి. ముఖ్యంగా Amazon, Flipkart వంటి ఈ-కామర్స్ సైట్లలో 10% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదనంగా, ప్రతి కొనుగోలుపై రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. అధిక విలువ కలిగిన వస్తువులు – టీవీలు, మొబైల్స్, ఫ్రిజ్‌లు, బహుమతుల కోసం క్రెడిట్ కార్డులు బెస్ట్ చాయిస్. SBI, HDFC, Kotak బ్యాంకులు పండుగ ప్రత్యేకంగా 0% డౌన్‌పేమెంట్ EMIలు అందిస్తున్నాయి. అయితే బిల్లులు సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం — ఆలస్యమైతే వడ్డీ ఛార్జీలు పెరిగే ప్రమాదం ఉంది.
UPI (Unified Payments Interface) అంటే మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా తక్షణ బ్యాంక్-టు-బ్యాంక్ చెల్లింపులు చేయగల సౌకర్యం. ఇది ఫిజికల్ కార్డు అవసరం లేకుండా ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ రెండింటికీ ఉపయోగపడుతుంది. వడ్డీ ఛార్జీలు లేవు, లావాదేవీలు సెకన్లలో పూర్తవుతాయి. BHIM, Kiwi, PhonePe, Google Pay వంటి యాప్‌లు పండుగ సీజన్లో ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులు అందిస్తున్నాయి. అయితే, క్రెడిట్ కార్డులతో పోలిస్తే వీటిలో రివార్డులు తక్కువగా ఉంటాయి. చిన్న, మధ్యస్థ చెల్లింపుల కోసం యూపీఐ అత్యంత సులభం. కొన్ని యాప్‌లు ఇప్పుడు క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాయి, దీంతో మరింత సౌలభ్యం లభిస్తోంది.