సినిమా ఇండస్ట్రీలోకి కొందరు హీరోలు వస్తారు, కొంతకాలం ఉండిపోతారు. కానీ, కొందరు మాత్రమే దశాబ్దాల తరబడి కళామతల్లికి సేవలు అందిస్తూ, చరిత్ర సృష్టిస్తారు. అలాంటి అరుదైన హీరోలలో ఒకరే మన మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, అనామకుడిలా వచ్చి ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన ఈ హీరో.. నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కి, ముఖ్యంగా డ్యాన్సింగ్ స్కిల్స్‌కి కేరాఫ్‌గా నిలిచారు.
1978లో ప్రారంభమైన ఆయన సినీ కెరీర్, ఇప్పటికీ అదే జోరుతో కొనసాగుతోందంటే, ఆయన కృషి, దృఢ సంకల్పం, టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఇండియాలో ఏ హీరోకు కూడా సాధ్యం కాని ఒక అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించి, తెలుగు ఇండస్ట్రీకే గర్వకారణంగా మారారు.
సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి.. హీరోగా, సుప్రీంహీరోగా, ఆపై మెగాస్టార్‌గా ఎదిగిన ప్రస్థానం చిరంజీవిది. ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్.
సినిమాపై ఇంట్రెస్ట్‌తో మద్రాస్ రైలెక్కిన శివ శంకర వరప్రసాద్, తన తల్లి సూచనతో తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. ‘పునాదిరాళ్లు’ సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టినా, రెండో చిత్రమైన ‘ప్రాణం ఖరీదు’తో 1978లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘మనవూరి పాండవులు’ సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది.
ఇక, 1983లో వచ్చిన ‘ఖైదీ’ సినిమాతో బాక్సాఫీస్ సక్సెస్ సాధించడమే కాకుండా, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. చిరంజీవి సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఆయన ఖాతాలో ఎన్నో మరపురాని హిట్లు ఉన్నాయి. 1980ల చివర్లో ఒకే ఏడాదిలో 14 హిట్లను సాధించి, ఇండియన్ సినిమా ‘ది న్యూ మనీ మెషీన్’ అనే బిరుదుని పొందారు.
ద వీక్ (The Week) పత్రిక ప్రకారం.. ఇండియాలో రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి యాక్టర్‌గా చిరంజీవి రికార్డు సృష్టించారు. 1990ల స్టార్టింగ్‌లో అత్యంత ప్రాఫిటబుల్ స్టార్‌గా ఎదిగిన మెగాస్టార్.. ఆ రోజుల్లోనే ఒక్కో సినిమాకు రూ.1 కోటి పారితోషికం తీసుకున్నారు.
అప్పటివరకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఇంత పారితోషికం తీసుకోలేదు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న రెండో నటుడిగా అమితాబ్ నిలిచారు. చిరంజీవి డ్యాన్స్‌కి కేరాఫ్‌గా నిలిచారు. ఎంతో మంది డ్యాన్సింగ్ కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనది. తన సినిమాల్లో డ్యాన్స్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి, కొరియోగ్రాఫర్ వ్యవస్థను ఒక కీలక డిపార్ట్మెంట్గా మార్చారు.
తన కెరీర్ మొత్తంలో 537 పాటల్లో 24 వేల కంటే ఎక్కువ డ్యాన్స్ మూవ్స్ చేసి, ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించారు. దీంతో, చిరంజీవిని ‘ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసేబుల్ యాక్టర్’గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కీర్తించింది.
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రిటైర్మెంట్ లేకుండా, సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా యువ హీరోలకు పోటీనిస్తున్నారు. 'విశ్వంభర' షూటింగ్ తర్వాత, అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘మన శంకర వరప్రసాద్’ గారు సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ 2026 సంక్రాంతికి బరిలోకి దిగుతోంది.
ఈ మూవీ తర్వాత చిరు, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా, చిరంజీవి ప్రస్థానం ఒక వ్యక్తి కథ కాదు, ఒక చరిత్ర అని చెప్పవచ్చు…!