తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మళ్లీ వివాదాల తుఫానులో చిక్కుకుంది. ప్రతీసీజన్‌లో తన కంటెంట్, టాస్క్‌లు, పాల్గొనేవారి ప్రవర్తనపై విమర్శలు ఎదుర్కొనే ఈ కార్యక్రమం ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ దాకా చేరింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ షోపై అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నదనే ఆరోపణలతో ఫిర్యాదు నమోదైంది.
సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు — కమ్మరి శ్రీనివాస్, బి. రవీందర్ రెడ్డి — ఈ ఫిర్యాదు చేశారు. వారు పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో, “బిగ్ బాస్ షోలో పాల్గొనేవారి ప్రవర్తన, సంభాషణలు కుటుంబ సభ్యులతో కలిసి చూడలేనంతగా ఉన్నాయి. టాస్క్‌ల రూపంలో అశ్లీల సన్నివేశాలను చూపిస్తూ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ షో సమాజంలో తప్పుడు విలువలను పెంచుతోంది” అని పేర్కొన్నారు. సమాజంపై దీని ప్రభావం దృష్ట్యా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
ఇంతకుముందు కూడా ‘బిగ్ బాస్’ పలు సార్లు వివాదాల్లో చిక్కుకుంది. కొందరు సామాజిక సంస్థలు, మతపరమైన సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని నిషేధించాలని డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ విమర్శలు పెద్దగా చట్టపరమైన చర్యలుగా మారలేదు. కానీ ఈసారి నేరుగా పోలీస్ ఫిర్యాదు రావడం టీవీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా “బిగ్ బాస్‌లో హద్దులు దాటుతున్న సన్నివేశాలు” అనే కామెంట్లు విస్తరిస్తున్నాయి.
బిగ్ బాస్ నిర్మాతల నుండి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. షో నిర్వాహకులు ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. అయితే, ప్రతి సంవత్సరం కొత్త సీజన్ ప్రారంభం కాగానే, కొన్ని ఎపిసోడ్లు ప్రసారమైన వెంటనే వివాదాలు మొదలవడం సాధారణం కావడం గమనార్హం. ప్రేక్షకులలో ఒక వర్గం ఈ షోను “వినోదాత్మకంగా” చూస్తే, మరో వర్గం మాత్రం “సామాజిక విలువలను దెబ్బతీసే కార్యక్రమం”గా విమర్శిస్తుంది.