ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యా మండలి శుభవార్త అందించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేస్తోన్న నేపథ్యంలో, పరీక్షా విధానంలో పలు కీలక సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులకు చెందిన విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన సడలింపును ప్రకటించింది. ఇకపై ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి ప్రాక్టికల్ సబ్జెక్టుల రాత పరీక్షల్లో అర మార్కు సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీని వల్ల విద్యార్థులు కేవలం అర మార్కు తేడాతో ఫెయిల్ అయ్యే పరిస్థితులు లేకుండా పోతాయి.
ఇప్పటి వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రాత పరీక్షల్లో కలిపి పాస్ కావాలంటే కనీసం 59.50 మార్కులు సాధించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని 59 మార్కులకు తగ్గించారు. అంటే 59 మార్కులు వచ్చినా విద్యార్థి ఉత్తీర్ణుడిగానే పరిగణిస్తారు. ఈ అర మార్కు సడలింపును సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షల్లో సర్దుబాటు చేయనున్నట్లు విద్యా మండలి ప్రకటించింది. అలాగే ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ మార్క్‌ను 10.5 నుంచి 11 మార్కులకు పెంచారు. ఈ మార్పులు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, పరీక్షల్లో ఉత్తీర్ణత రేటును పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
విద్యా మండలి ఈసారి పరీక్షా విధానంలో మరికొన్ని ప్రాముఖ్యమైన సంస్కరణలను కూడా ప్రవేశపెట్టింది. మొదటి సంవత్సరం పరీక్షల్లో కొత్తగా ఒక మార్కు ప్రశ్నలను తీసుకువచ్చారు. అయితే, ఈ ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఎలాంటి ఛాయిస్ ఉండదని స్పష్టం చేశారు. ఇక వృక్షశాస్త్రం (బోటనీ) మరియు జంతుశాస్త్రం (జువాలజీ) పేపర్లను కలిపి, ఒకే జీవశాస్త్రం (బయోలజీ) పేపర్‌గా మార్చారు. ఇందులో బోటనీ నుంచి 43 మార్కులకు, జువాలజీ నుంచి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థుల సమగ్ర అవగాహనను పరీక్షించడానికి ఈ మార్పులు చేసినట్లు మండలి తెలిపింది.
ఇదిలా ఉండగా, కొన్ని పాత నిబంధనలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఏదైనా ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించి, మిగిలిన సబ్జెక్టుల్లో కనీసం 30 శాతం మార్కులు సాధిస్తే, ఆ విద్యార్థిని ఉత్తీర్ణుడిగా పరిగణించే విధానం కొనసాగుతుంది. అలాగే జాగ్రఫీ సబ్జెక్టు సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు, పాత విధానంలోనే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. అదనంగా, విద్యార్థులు తమ గ్రూపులో ఆరవ సబ్జెక్టును పాస్ చేయడం తప్పనిసరి కాదని, దానికి ప్రత్యేక మెమో జారీ చేస్తామని బోర్డు వెల్లడించింది. ఈ మార్పులు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసినవని మండలి తెలిపింది.