వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. సబ్సిడీ ప్రయోజనాలను కొనసాగించాలంటే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కింద లబ్ధి పొందుతున్న గృహిణీలు ప్రతి సంవత్సరం మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. గడువు మించితే ఆ సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీని రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో కూడా రాయితీ ఇవ్వబోమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
ఇక ఈ ఆదేశాల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ఆయిల్ కంపెనీలు వేగంగా కదిలాయి. తమ డీలర్లకు లక్ష్యాలు నిర్ధేశించి, వినియోగదారులను ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల గృహ గ్యాస్ వినియోగదారులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం 60 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. గడువు లోపు ఈ ప్రక్రియ చేయని వారికి సబ్సిడీ నిలిచిపోయినా, గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని కంపెనీలు తెలిపాయి. అయితే వారు రాయితీ లేకుండా పూర్తి ధర చెల్లించి సిలిండర్ కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.
వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ ప్రక్రియను పలు మార్గాల్లో అందుబాటులో ఉంచారు. వినియోగదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మొబైల్ యాప్ ద్వారా, లేదా సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి, అలాగే సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వద్ద కూడా బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయవచ్చు. అయినప్పటికీ, ప్రజల స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. “వినియోగదారులు ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తున్నారనీ, దాంతో సబ్సిడీ నిలిచే ప్రమాదం ఉందని” డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరోవైపు ఆయిల్ కంపెనీలు, డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. తమ పరిధిలోని వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించాయి. దీనిపై అఖిల భారత గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు స్పందిస్తూ, “వినియోగదారుల వద్ద అనేక సాంకేతిక, సౌకర్య సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో డీలర్లపై ఒత్తిడి తేవడం సరికాదు” అన్నారు. అయితే సబ్సిడీ పొందాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఇది సబ్సిడీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, అక్రమ లబ్ధిదారులను నివారించడంలో కీలకంగా ఉండనుంది.