తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఎక్కువసేపు క్యూలో నిలబడే ఇబ్బందులను తగ్గించేందుకు కొత్తగా శాశ్వత క్యూలైన్లు, విశ్రాంతి షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎస్ఎస్డీ టోకెన్లతో వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎంబీసీ ప్రాంతంలోని ప్రవేశమార్గాన్ని విస్తరించి, నాలుగు వేల మంది కూర్చునేలా పెద్ద షెడ్ నిర్మిస్తారు. ఈ చర్యలతో భక్తులు ఎండ, వాన సమస్యల నుంచి ఉపశమనం పొందనున్నారు.
ప్రస్తుతం తిరుమలలో రోజుకు సుమారు 12 వేల నుండి 16 వేల వరకు SSD టోకెన్లు జారీ అవుతున్నాయి. వీకెండ్స్ మరియు పండుగల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వరకు చేరుతున్నాయి. అందువల్ల బాటగంగమ్మ ఆలయం నుండి గోగర్భం జలాశయం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రూ.12 కోట్ల వ్యయంతో శాశ్వత క్యూలైన్లు నిర్మించనున్నారు. అదనంగా రూ.5.6 కోట్లతో మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
టీటీడీ పాలకమండలి భక్తులకు మాత్రమే కాకుండా, హిందూ ధర్మ పరిరక్షణ దిశగా కూడా కొత్త నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల్లో ఐదు వేల శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి రూ.175 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.750 కోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఆలయాలు మూడు రకాలుగా — గ్రామాల జనాభా, అవసరాలను బట్టి — రూ.10, రూ.15, రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు.
దేవాదాయశాఖ పర్యవేక్షణలో ఆలయాల నిర్మాణం పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించనున్నారు. ప్రతి దశలో నిర్మాణ ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఈ చర్యతో గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారం మరింత బలపడనుందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల భక్తులకు ఈ చర్యలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. భక్తుల సౌకర్యాలు, విశ్రాంతి సదుపాయాలు, శాశ్వత క్యూలైన్లతో దర్శన అనుభవం మరింత సౌకర్యవంతంగా మారనుంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడనుంది.