ఇటీవల దీపావళి సందర్భంగా ఢిల్లీలో ఊపిరాడని పరిస్థితులు నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా మనందరికీ తెలిసినదే. వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ ప్రమాదకర పరిస్థితిని నియంత్రించేందుకు ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ప్రకృతి వర్షం రాకపోతే మనమే వర్షం కురిపిద్దాం అనే ప్రయత్నంగా మేఘమథనం (Cloud Seeding)చేపట్టారు. కానీ తొలి దశలో అది పెద్దగా ఫలించలేదు.
అక్టోబర్ 28న రెండు సార్లు మేఘమథనం చేశారు. కానీ, గాలిలో తేమ కేవలం 15 శాతం మాత్రమే ఉండటంతో వర్షపు చినుకులు ఏర్పడలేదని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. తేమ శాతం 40 దాటితే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంది అని ఆయన వివరించారు.
మేఘమథనం ఎలా పనిచేస్తుంది?
సాధారణ ఉప్పు, రాక్ సాల్ట్, సిల్వర్ అయోడైడ్ కణాలను విమానం ద్వారా మేఘాల్లోకి పిచికారీ చేస్తారు. ఇవి నీటి ఆవిరిని ఆకర్షించి ఘనీభవనాన్ని పెంచుతాయి. మేఘాలు బరువెక్కి నీటి చుక్కలుగా మారి కింద పడతాయి. ఈ ప్రక్రియ విజయవంతమైతే కృత్రిమ వర్షం కురుస్తుంది.
ఒక్కసారి ప్రయత్నానికి రూ.60 లక్షల ఖర్చు
ఒక్కసారి మేఘమథనం చేయడానికి దాదాపు రూ.60 లక్షలు ఖర్చవుతుంది. 300 చ.కి.మీ. ప్రాంతంలో ఈ ప్రయోగం నిర్వహించగా, ఒక్క చదరపు కిలోమీటరుకు సుమారు రూ.20 వేల ఖర్చు అయ్యిందని ఐఐటీ అంచనా వేసింది. మొత్తం శీతాకాలంలో 12 సార్లు ఈ ప్రక్రియ చేస్తే దాదాపు రూ.25 కోట్ల వ్యయంఅవుతుంది.
బడ్జెట్లో చిన్న భాగమే
ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు రూ.300 కోట్లు కేటాయించింది. అందులో మేఘమథనం కోసం రూ.3.2 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇది పెద్ద ఖర్చు కాదు. కానీ శాశ్వత పరిష్కారం కూడా కాదు. కాలుష్య మూలాన్ని అదుపులో పెట్టకపోతే సమస్య మళ్లీ వస్తూనే ఉంటుంది అని అగర్వాల్ హెచ్చరించారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ (AQI) 450 దాటింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థాయి. పీఎం 2.5, పీఎం 10 వంటి సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
ఐఐటీ కాన్పూర్ బృందం వాతావరణ తేమ పెరిగిన వెంటనే మరోసారి మేఘమథనం చేయాలని నిర్ణయించింది.తాత్కాలిక ఉపశమనం అందించడమే మా లక్ష్యం. కానీ దీర్ఘకాల పరిష్కారం కోసం ఢిల్లీ మొత్తం కాలుష్య నియంత్రణ వ్యవస్థనే బలోపేతం చేయాలి అని బృందం స్పష్టం చేసింది.