Amaravati Capital Legality: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కొనియాడారు. శనివారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానానికి మద్దతుగా ఆమె మాట్లాడారు. ఈ నిర్ణయం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని, ఇది రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తుకు గట్టి భరోసా ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. రాజధాని నగరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి సంపద పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వగానే, ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషమని మంత్రి అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా దాదాపు 33 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించడం ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి అని గుర్తు చేశారు. ఇది కేవలం చంద్రబాబు గారిపై ఉన్న నమ్మకంతోనే సాధ్యమైందని ఆమె తెలిపారు. నాడు ప్రధాని నరేంద్ర మోదీ గారు పవిత్ర నదుల జలాలు, మట్టిని తీసుకొచ్చి ఈ నగరానికి పునాది వేశారని, అటువంటి పవిత్రమైన నగరాన్ని నిర్మించడం మనందరి బాధ్యతని మంత్రి సవిత వివరించారు.
గత ఐదేళ్లలో అమరావతి విషయంలో జరిగిన గందరగోళంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతిస్తున్నామని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని నమ్మబలికిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. "మూడు ముక్కలాట" పేరుతో రాజధానిని అస్థిరపరిచి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. రాజధానిపై స్పష్టత లేకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని, పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి పనులు మళ్ళీ ఊపందుకున్నాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం రాజధానిపైనే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె తెలిపారు. ప్రాంతాల వారీగా హార్టీకల్చర్, సిరికల్చర్, పారిశ్రామిక మరియు టెక్స్‌టైల్ హబ్‌లను ఏర్పాటు చేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలకు అనుగుణంగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సుందర నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆమె వివరించారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ కొత్త తీర్మానం వల్ల భవిష్యత్తులో ఎవరూ రాజధానిని కదిలించే సాహసం చేయలేరని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. ఇది పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుందని, తద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతం ఒక సంపద సృష్టించే కేంద్రంగా మారి, యువతకు భారీగా ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.