3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్..
సలహాలు, సూచనల కోసం 30 రోజుల గడువు..
అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
ఈ భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలోనే తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, భూములు ఇవ్వబోయే రైతులు, స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. ఈ కాలంలో వచ్చిన సూచనలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి నిర్మాణానికి మరింత ఊపొస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.