Business- ఆకాశాన్నంటిన విమాన ప్రయాణ ఖర్చులు – కిలోలీటర్ ఇంధనం రూ.2.07 లక్షలు.
రెట్టింపైన ఇంధన భారం: విమానయాన రంగానికి షాక్.
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం: భగ్గుమంటున్న చమురు ధరలు.
Jet Fuel Price: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో, దేశీయంగా విమాన ఇంధన (ATF) ధరలు ఆకాశాన్ని తాకాయి. గతంలో కిలోలీటర్ ధర ₹96,638 ఉండగా, అది ఇప్పుడు ఏకంగా ₹2.07 లక్షలకు చేరుకుంది. విమాన ఇంధన చరిత్రలో ఒక కిలోలీటర్ ధర ₹2 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఈ భారీ పెంపుతో గత ధరల కంటే రెట్టింపు వ్యయం పెరగడం గమనార్హం.
ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు. భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయ చమురు సరఫరాపై పడటంతో మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వస్తున్న మార్పులు నేరుగా ఏటీఎఫ్ ధరలపై ప్రభావం చూపడం వల్ల విమానయాన సంస్థలపై అదనపు భారంగా మారింది.
ఇంధన ధరలు ఇలాగే కొనసాగితే, విమాన ప్రయాణ భారాలు పెరిగే అవకాశం ఉంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధనానికే దాదాపు 40% వాటా ఉంటుంది. ధరలు రికార్డు స్థాయిలో పెరగడం వల్ల ప్రయాణికులపై టికెట్ ధరల రూపంలో భారం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.