హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. “25 లక్షల ఓట్లు దొంగిలించబడ్డాయి, ఇది బ్రెజిల్ మోడల్ లాంటిదే” అని ఆయన చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించగా, ఎన్నికల ప్రక్రియపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీకి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం (EC) కౌంటర్ ఇచ్చింది.
ఎన్నికల సంఘం స్పందిస్తూ, రాహుల్ గాంధీని నేరుగా ప్రశ్నించింది — ఓటరు జాబితా సమగ్ర సవరణ (Summary Revision - SIR)ను ఆయన సమర్థిస్తున్నారా? లేక వ్యతిరేకిస్తున్నారా? అని. ఎన్నికల ప్రక్రియను నిందించడం సరికాదని, హర్యానా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల జాబితాలు సక్రమంగా పరిశీలించబడ్డాయని, అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారని వెల్లడించింది.
అంతేకాక, పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ ఏజెంట్లు ఉన్నారని, వారు ఆ సమయంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని ఈసీ గుర్తుచేసింది. ఎన్నికల సమయంలో పార్టీ ఏజెంట్ల బాధ్యత కూడా ఉందని, తర్వాత ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, సాంకేతిక ఆధారంగా జరుగుతుందని ఎన్నికల సంఘం మళ్లీ స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలతో బీజేపీ నేతలు కూడా విమర్శలకు దిగారు. ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేకుండా ప్రజల్లో అపోహలు సృష్టించడమే ఈ వ్యాఖ్యల ఉద్దేశమని వారు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం హర్యానా ఎన్నికల్లో సాంకేతిక లోపాలు జరిగాయని, ఎన్నికల సంఘం వాటిని నిర్లక్ష్యం చేసిందని వాదిస్తున్నారు. ఈ వివాదంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై చర్చ మొదలైంది.