భార్యాభర్తల బంధం అనేది జీవితాంతం కొనసాగాల్సిన సున్నితమైన అనుబంధం. ఈ సంబంధం నమ్మకం, గౌరవం, ప్రేమ అనే మూడు మూలాధారాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏదైనా ఒకటి బలహీనమైతే సంబంధం దెబ్బతింటుంది. అనుకోకుండా కూడా జంటలు చేసే కొన్ని చిన్న తప్పులు వారి మధ్య దూరం పెంచుతాయి.
రిలేషన్‌షిప్ కోచ్ అలోక్ సూచనల ప్రకారం, భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తితో పంచుకోకూడదు. ముఖ్యంగా పిల్లల పెంపకం, కుటుంబ నిర్ణయాలు, ఆర్థిక విషయాలు లేదా భాగస్వామి లోపాలు వంటి విషయాలను ఇతరుల ముందు చర్చించడం సంబంధంలో విభేదాలకు దారితీస్తుంది.
తల్లిదండ్రులుగా పిల్లల పెంపకంపై అభిప్రాయ భేదాలు సహజమే కానీ వాటిని ఇతరుల ముందు ప్రస్తావించడం మంచిది కాదు. అలాగే, భాగస్వామి లోపాలను బంధువుల లేదా స్నేహితుల ముందు చెప్పడం వారి గౌరవాన్ని తగ్గిస్తుంది. ఇది తరువాత పెద్ద గొడవలకు దారితీస్తుంది. ఇలాంటి విషయాలను ప్రైవేట్‌గా పరిష్కరించుకోవడం ఉత్తమం.
డబ్బు విషయాలు చాలా వ్యక్తిగతమైనవి. వీటిని మూడో వ్యక్తితో పంచుకోవడం వల్ల అపార్థాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే కానీ వాటిని ఇతరులతో చెప్పడం సంబంధాన్ని మరింత దెబ్బతీస్తుంది. ప్రతి సమస్యను పరస్పర అవగాహనతో పరిష్కరించడం నేర్చుకోవాలి.
భాగస్వామిని ఎవరితోనూ పోల్చకూడదు. ప్రతి వ్యక్తికి తన ప్రత్యేకత ఉంటుంది. వారిని ఉన్నట్లుగా అంగీకరించడం ప్రేమకు నిజమైన అర్ధం. భార్యాభర్తలు ఒకరి గౌరవాన్ని, ప్రైవసీని కాపాడితేనే బంధం బలంగా ఉంటుంది. కొన్ని విషయాలను మన మధ్యే ఉంచుకోవడం వల్ల సంబంధం మరింత అందంగా మారుతుంది.