శ్రీశైలంలో గురువారం ఒక చారిత్రాత్మక వాతావరణం నెలకొంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేసి స్వామివార్ల సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి భక్తి వాతావరణం అలముకుంది.

ఆలయ అధికారులు, వేద పండితులు, జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతంతో ప్రధాని మోదీని ఆహ్వానించారు. ప్రధాని మొదట శ్రీ మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయం వెలుపల కొద్దిసేపు ధ్యానంలో మునిగిపోయారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్‌లకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ప్రధానికి అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి శ్రీశైల ఆలయ కళారూపాన్ని ప్రధానికి అందజేసి గౌరవం తెలిపారు. ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, విశేషాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. సుమారు ఒక గంటపాటు ప్రధాని ఆలయంలో గడిపి భక్తుల ఆరాధనకు స్ఫూర్తి కలిగించారు.
తరువాత ప్రధాని శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ గోడలపై ఉన్న శివాజీ మహారాజ్ వీరగాథలను తెలిపే చిత్రాలను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. కేంద్రంలోని అతి పెద్ద శివాజీ చిత్రానికి నమస్కరించి, దర్బార్ హాలు, ధ్యాన మందిరం వంటి విభాగాల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూలమాల అర్పించి ప్రార్థనలు చేశారు.
తరువాత కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభా వేదికపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాలువాతో సత్కారం చేశారు. మహాశివుడి ప్రతిమను జ్ఞాపికగా ప్రధానికి అందజేశారు. జీఎస్టీ సేవింగ్స్‌పై రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక పుస్తకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రధానికి అందించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి కనీసం 15 ఏళ్లకు తగ్గకుండా బలంగా కొనసాగుతుందని తెలిపారు. పెట్టుబడులు, నమ్మకం సడలించకుండా ముందుకు వెళ్తామని, ప్రధాని మరియు ముఖ్యమంత్రి నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తూ వచ్చే తరాల ఆకాంక్షలను నెరవేర్చుతామని అన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచికోసమేనని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు