రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది దొనెట్స్క్ ప్రాంతం తమ ఆధీనంలోకి రావాలన్న రష్యా పట్టుబాటు మరింత బలపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణలో ఈ అంశం కీలకంగా చర్చించబడిందని తెలుస్తోంది. దాదాపు 11ఏళ్లుగా ఉక్రెయిన్‌లో రష్యా సైన్యాలు ఈ ప్రాంతం కోసం పోరాడుతూనే ఉన్నాయి.
సమాచారం ప్రకారం పుతిన్ ట్రంప్ ముందు కొత్త ప్రతిపాదనను ఉంచారు. రష్యా నియంత్రణలో ఉన్న జపొరిజియా ఖేర్సాన్ ప్రాంతాలను ఉక్రెయిన్‌కు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారని వాషింగ్టన్ పోస్ట్ ద్వారా పేర్కొంది. అయితే దీనికి ప్రతిగా దొనెట్స్క్ను తమకు అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేశారని సమాచారం. ఈ ప్రతిపాదనతో రష్యా కొంత సడలింపు చూపుతున్నట్లు అనిపించినా, దానిలో దాగి ఉన్న వ్యూహాత్మక ఉద్దేశ్యం పశ్చిమ దేశాలను ఆందోళనకు గురి చేసింది.
ఇదిలా ఉండగా అదే రోజు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో కూడా చర్చించారు. అయితే వైట్‌హౌస్ విడుదల చేసిన ప్రకటనలో పుతిన్ డిమాండ్ల గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. నిపుణుల అంచనాల ప్రకారం ఉక్రెయిన్ దొనెట్స్క్ను వదులుకుంటే అది దేశ శరీరంలోని ఓ భాగాన్ని త్యజించినట్లే అవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 20శాతం రష్యా నియంత్రణలో ఉందనే విషయం కూడా ఈ సందర్భంలో ప్రస్తావనీయమే.
మరోవైపు ఉక్రెయిన్ కోరుతున్న తోమహాక్ దీర్ఘశ్రేణి క్షిపణుల విషయంలో అమెరికా జాగ్రత్తపూర్వకంగా వ్యవహరిస్తోంది. వాషింగ్టన్లో జెలెన్స్కీ, ట్రంప్ సమావేశంలో కూడా ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం రాలేదు. అమెరికా ఈ ఆయుధాలను సరఫరా చేస్తే రష్యాపై పెద్ద మానసిక ఒత్తిడి సృష్టించగలమని ఉక్రెయిన్ భావిస్తోంది. కానీ, ట్రంప్ మాత్రం యుద్ధం తక్షణమే ఆగాలి అనే వ్యాఖ్యతోనే తన వైఖరిని స్పష్టం చేశారు.
తాజాగా ట్రంప్ పుతిన్‌కు చివరి హెచ్చరిక ఇస్తానని కూడా ప్రకటించారు. పుతిన్ శాంతి చర్చల్లో నిజాయితీగా వ్యవహరించకపోతే ఉక్రెయిన్‌కు తోమహాక్ క్షిపణులు ఇవ్వడానికి తాను వెనుకాడనని ట్రంప్ హెచ్చరించారు. ఇది రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త దశకు నాంది కావచ్చని అమెరికా మీడియా అంచనా వేస్తోంది.
దొనెట్స్క్‌పై రష్యా పట్టుబాటు – పుతిన్ ప్రతిపాదనతో అమెరికా ఆందోళన !!
