పిల్లల చిన్న వయసు అంటేనే ఎదుగుదలకి బంగారు దశ ఈ దశలో సరైన ఆహారం, సరైన సంరక్షణ లేకపోతే అది వారి భవిష్యత్తుపై చెడు ముద్ర పరోక్షంగా వేసినట్లే. నిపుణులు చెబుతున్నట్లుగా, పిల్లల శరీరానికి ఆహారం అంటే కేవలం తిండి కాదు — అది వారి ఎదుగుదలకి బలం. కానీ దురదృష్టవశాత్తు ఇంకా చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు.
పిల్లల శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ సరిగ్గా అందకపోతే వాళ్ల ఎదుగుదల ఆగిపోతుంది. అలసట, బలహీనత, తరచూ జలుబు లేదా జ్వరం రావడం లాంటి సమస్యలు మొదలవుతాయి. పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎత్తు తగ్గడం, బరువు తగ్గడం కూడా సాధారణమే.
పుట్టిన తరువాత తొలి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. మొదటి ఆరు నెలలు తల్లిపాలే పిల్లలకి సరైన ఆహారం. తల్లిపాలు పిల్లలకి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, శరీరాన్ని బలపరుస్తాయి. రెండు సంవత్సరాల వయసు వచ్చేవరకు తల్లిపాల వెంటపాటు సరైన ఆహారం ఇవ్వడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
చాలామంది దృష్టికి రాని విషయం అయోడిన్ లోపం. సాధారణ ఉప్పు కంటే అయోడైజ్డ్ ఉప్పు వాడితే పిల్లలలో థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఐరన్, విటమిన్ ఎ, జింక్ లాంటి సూక్ష్మపోషకాలు కూడా పిల్లల ఎదుగుదలలో కీలకం.
తల్లిదండ్రులు పిల్లలకు టీకాలు వేయడంలో నిర్లక్ష్యం చేయకూడదు. బీసీజీ, డీపీటీ, పోలియో, మీజిల్స్ వంటి టీకాలు పిల్లలను తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇది పిల్లల జీవితంలో అత్యవసరమైన రక్షణ చర్య అని వైద్యులు చెబుతున్నారు.
ప్రతి రోజూ పిల్లలకు పండ్లు, కూరగాయలు ఇవ్వాలి.
ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తగ్గించాలి.
సమయానికి టీకాలు వేయించాలి.
పిల్లలు ఆడుకునే సమయం ఇవ్వాలి.
పాఠశాలలో మధ్యాహ్న భోజనం (మిడ్డేల్ మీల్) కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
పిల్లల ఎదుగుదల ఒక రోజు వ్యవహారం కాదు — అది నిరంతర ప్రక్రియ. ప్రతి తల్లి, తండ్రి పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, సరైన ఆహారం, శుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చిస్తే మాత్రమే ఆరోగ్యవంతమైన తరం ఏర్పడుతుంది.
ఈ సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య పరిస్థితి ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి మీ డాక్టర్ సూచనల మేరకు తీసుకోవడం మంచిది.