ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు రాష్ట్ర ప్రతినిధుల బృందం కూడా పాల్గొంది. యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ (AgriTech) రంగానికి చెందిన ప్రముఖ పరిశోధకులతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
సమావేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించే మార్గాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వ్యవసాయ హబ్‌ల ఏర్పాటు, డేటా ఆధారిత పంటల పర్యవేక్షణ, వాతావరణ అంచనాల ఆధారంగా సాగు విధానాల రూపకల్పన వంటి అంశాలపై మంత్రి లోకేష్ ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని కొత్త దిశలో తీసుకెళ్లేందుకు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భవిష్యత్‌లో రైతులు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా చేయడం మన లక్ష్యం. దీనికి ఏఐ, డ్రోన్ టెక్నాలజీలు, సెన్సార్ ఆధారిత పంటల పర్యవేక్షణ వంటి ఆధునిక సాంకేతికతలు అవసరం అని తెలిపారు. ఈ దిశగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సెంటర్లతో భాగస్వామ్యాల ద్వారా రైతులకు స్మార్ట్ వ్యవసాయ పరిష్కారాలు అందించాలనే లక్ష్యాన్ని లోకేష్ ఈ సందర్శనలో స్పష్టంగా వివరించారు. ఆయన సూచనలపై వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ బృందం ఒక సంయుక్త పరిశోధన ప్రణాళిక రూపొందించేందుకు అంగీకరించింది.
లోకేష్ పర్యటన ద్వారా ఏపీ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ సాంకేతికతల అనుసంధానానికి మరో అడుగు వేసినట్టైంది. ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి రైతు జీవితాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, దిగుబడిని పెంచడం వంటి అంశాల్లో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో మంత్రి నారా లోకేష్ పర్యటన – ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలపై చర్చ!!
