మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. బలమైన గాలులు, వర్షాల నడుమ మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. ఈ ప్రక్రియ రాత్రంతా కొనసాగి, బుధవారం తెల్లవారుజామున తుపాను బలహీనమై తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం ఇది ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ దిశగా కదిలింది. బుధవారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా బలహీనపడినా, దాని ప్రభావంతో గురువారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడగా, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు చేరింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లాల వారీగా అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఈ రోజు అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఇదే విధంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పలు స్కూళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు వసతి కల్పించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించగా, అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇక కాకినాడ జిల్లాలో అక్టోబర్ 31 వరకు సెలవులు ఇవ్వగా, ఆ తర్వాత స్కూళ్లను తిరిగి ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తీవ్రంగా నమోదైంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 10 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం కూడా ఎన్టీఆర్, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొనసాగాయి. తుఫాన్ తీరం దాటినప్పటికీ, సముద్రం ఇంకా అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.