వరుసగా మూడవ ఏడాది ప్రతిష్టాత్మకంగా వాలీబాల్ టోర్నమెంట్..
డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (DARA) ఆధ్వర్యంలో..
డల్లాస్ ప్రాంతంలో డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (DARA) ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, కమ్యూనిటీని ఒకే వేదిక పైకి తీసుకురావడం లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించారు.
దారా సంస్థ వరుసగా మూడవ ఏడాది ఈ టోర్నమెంట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం విశేషం. డల్లాస్ ప్రాంతం నలుమూలల నుంచి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగి ప్రేక్షకులను ఉర్రూతలూగించిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రమేష్ రెడ్డి దండేల చేసిన కృషిని దారా ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ప్రశంసించారు. రిజిస్ట్రేషన్ నుంచి మ్యాచ్‌ల నిర్వహణ వరకు ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే విజేతలకు అందజేసిన ఆకర్షణీయమైన ట్రోఫీలను గౌతమ్ కాసిరెడ్డి సమకూర్చారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పీఆర్ మేనేజర్ నాగేశ్వర్ అల్లగడ్డ టోర్నమెంట్ దృశ్యాలను కెమెరాలో బంధించి కార్యక్రమాన్ని డాక్యుమెంట్ చేశారు.
ఈ టోర్నమెంట్ విజయానికి అనేక మంది సభ్యులు, వాలంటీర్లు తమవంతు సహకారం అందించారు. సతీష్ బొమ్మినేని, సునీల్ దేవిరెడ్డి, కృష్ణారెడ్డి కోడూరు, చైతన్య నాల, అమర్ కలకడ, శ్రీని అన్నారెడ్డి, సాగర్ పల్ల, ప్రవీణ్ పల్ల, వెంకట్ రెడ్డి, గురు నరేష్, హరి సింగం, భాస్కర్ గండికోట, మధు మల్లు, చిన్న సత్యం, మహేష్, చంద్ర పొట్టిపాటి, పార్థ సారథి, అమర్, ఇమ్రాన్ బంగష్, సందీప్ తదితరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి దారా బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన మద్దతుతో సమాజంలోని పేదలు, వెనుకబడిన వర్గాలకు సహాయం చేసే సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు దారా ప్రెసిడెంట్ వీరశివారెడ్డి లేవక తెలిపారు. క్రీడాకారులు, స్పాన్సర్లు, మద్దతుదారులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
క్రీడల ద్వారా కమ్యూనిటీని ఏకం చేయడంలో దారా మరోసారి విజయవంతమైంది. ఈ టోర్నమెంట్ కేవలం ఆటలకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాలకు కూడా దోహదపడటం విశేషం.