తెలుగు భాషా ప్రాచుర్యం, సాహిత్యాభివృద్ధికి జీవితాంతం అంకితమై సేవలు అందించిన బ్రిటిష్ పండితుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం నవంబర్ 10న సీపీ బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో తెలుగు సాహిత్య పునరుజ్జీవనంలో బ్రౌన్ చేసిన కృషికి ప్రభుత్వ స్థాయిలో సముచిత గౌరవం లభించినట్టయింది.
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో సీపీ బ్రౌన్ తెలుగు భాషాభివృద్ధికి చేసిన విశేష కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. "సీపీ బ్రౌన్ తన వ్యక్తిగత సమయాన్ని, సంపాదనలో ప్రతి రూపాయిని తెలుగు భాష పరిరక్షణకు, వ్యాకరణ నిర్మాణానికి, సాహిత్య ప్రోత్సాహానికి అంకితం చేశారు. తెలుగు అధ్యయనాలకు కృషి చేసిన యూరోపియన్ పండితుల్లో ఆయన పేరు ఒక దీపంలా వెలుగుతుంది" అని ప్రభుత్వం పేర్కొంది.
తెలుగు భాషను వ్యవస్థీకృతంగా అధ్యయనం చేయడానికి, వ్యాకరణ పద్ధతులను సవరించి సరళంగా రూపొందించడానికి బ్రౌన్ చేసిన కృషి అపారమైనది. ఆయన సేకరించిన తెలుగు సాహిత్య గ్రంథాలు, పదకోశాలు ఇప్పటికీ పరిశోధకులకు మార్గదర్శకాలు అవుతున్నాయి. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా పనిచేసిన ఆయన, విదేశీ నేలపై తెలుగు భాష ప్రతిష్ఠను పెంచడంలో కీలకపాత్ర పోషించారు. బ్రౌన్ కృషి వల్లే తెలుగు సాహిత్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి.
తెలుగు సంస్కృతికి తన జీవితాన్ని అంకితం చేసిన సీపీ బ్రౌన్‌ను ప్రభుత్వం ‘తెలుగు భాషా ప్రియుడిగా’, ‘సాహిత్య సంరక్షకుడిగా’ అభివర్ణించింది. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరపడం ద్వారా నేటి తరం యువతకు తెలుగు సాహిత్య వారసత్వంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, సాహిత్య సంస్థల్లో ఈ సందర్భంగా తెలుగు భాషా మహిమ, బ్రౌన్ సేవలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.