రాప్తాడు నియోజకవర్గ పరిధి లోని రెండు రెవెన్యూ డివిజన్లను యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఒక నియోజకవర్గంలోని మండలాలు ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలన్న దానిపై మంత్రివర్గ ఉపసంఘం, రెవెన్యూ శాఖలు యోచిస్తున్న తరుణంలో ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న మండలాల పరిస్థితుల గురించి వివరిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు లేఖలు రాశారు.
రాప్తాడు నియోజకవర్గం భౌగోళికంగా చాలా భిన్నమైన పరిస్థితిలో ఏర్పడిందని.. ఇక్కడ మొత్తం 6 మండలాలు ఉండగా, జిల్లాల విభజన సమయంలో 3 మండలాలు అనంతపురం జిల్లాలో.. మరో 3 మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో చేర్చారన్నారు.
ఈ క్రమంలో 3 మండలాలు అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో, మరో 3 మండలాలు ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయని వివరించారు. అనగా రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలు అనంతపురం జిల్లాలోని అనంతపురం రెవెన్యూ డివిజన్ లో ఉండగా, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటాయన్నారు.
భౌగోళికంగా, ప్రజల అవసరాలు, పరిపాలన సౌలభ్యపరంగా ఇది అందరికి అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఒక నియోజకవర్గమంతా.. ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలనే నిర్ణయం తీసుకుంటోందని.. అందుకే తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాలను ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొస్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని.. ఉదాహరణకు అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోగల ఆత్మకూరు మండలంలోని కొన్ని గ్రామాల నుంచి వయా అనంతపురం మీదుగా శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వెళ్లాలంటే సుమారు 80 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
అలాగే ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోగల రామగిరి మండలంలోని గరిమేకలపల్లి తదితర గ్రామాలు మరియు చెన్నేకొత్తపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి, గంగినేపల్లి తదితర గ్రామాల నుంచి వయా ధర్మవరం మీదుగా అనంతపురం ఆర్డీవో కార్యాలయానికి రావాలంటే సుమారు 80 నుంచి 85 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
రైతులు, ప్రజలు, విద్యార్థుల సౌకర్యం కోసం, అలాగే పరిపాలన సౌలభ్యం కోసం శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కనగానపల్లి రామగిరి చెన్నేకొత్తపల్లి మండలాలను ప్రస్తుతం ఉన్న విధంగా ధర్మవరం రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలని అలాగే అనంతపురం జిల్లా పరిధిలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాలను ప్రస్తుతం ఉన్న విధంగా అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే సునీత కోరారు.