హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన మూసాపేట మెట్రో స్టేషన్లో శనివారం రాత్రి ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్ లభ్యమవ్వడం అక్కడ తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా మెట్రో స్టేషన్లలో భద్రతా చర్యలు కఠినంగా అమల్లో ఉంటాయి. అయితే, ఈ సంఘటనతో ప్రయాణికులు మరియు అధికారులు ఉలిక్కిపడ్డారు.
వివరాల్లోకి వెళితే, బీహార్‌కు చెందిన మహ్మద్ అనే యువకుడు ప్రగతినగర్‌లో నివసిస్తూ, ఓ ఫ్యాబ్రికేషన్ యూనిట్లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి మెట్రో రైలు ఎక్కేందుకు మూసాపేట స్టేషన్‌కు వచ్చిన అతడు, తన లగేజీని భద్రతా తనిఖీ కోసం స్కానింగ్ యంత్రంలో ఉంచాడు. ఆ సమయంలో యంత్రం అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో 9 ఎంఎం బుల్లెట్ ఒకటి కనిపించింది.
ఈ దృశ్యం చూసి అక్కడున్న సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తర్వాత మెట్రో అధికారులు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుల్లెట్ యువకుడి వద్దకు ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహ్మద్ దీనిపై తాను తెలియదని చెబుతున్నట్లు సమాచారం.
ఇక ఇటీవల మూసాపేట మెట్రో స్టేషన్లో జరిగిన మరో ఘటన ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. గత నెలలో అదే స్టేషన్లో ఓ యువతిపై ఆమె ప్రియుడు బ్లేడుతో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు బుల్లెట్ ఘటన కూడా చోటు చేసుకోవడంతో మెట్రో స్టేషన్ల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.