భారత స్టేట్ బ్యాంక్ (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. నవంబర్ 1, 2025 నుండి ఎస్బీఐ కార్డులకు సంబంధించి పలు ఛార్జీలు, ఫీజుల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా విద్యా ఫీజు చెల్లింపులు, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్, అలాగే వాలెట్లలోకి ఫండ్ యాడ్ చేసుకోవడంపై ప్రభావం చూపనున్నాయి. వినియోగదారులు తమ లావాదేవీలు చేసేముందు ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవడం తప్పనిసరి అవుతోంది.
ముఖ్యంగా స్కూల్, కాలేజ్, లేదా ఇతర విద్యా సంస్థల ఫీజులు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించినపుడు ఇకపై 1 శాతం అదనపు రుసుము వసూలు చేయబడుతుంది. ఉదాహరణకు రూ.10,000 ఫీజు చెల్లిస్తే అదనంగా రూ.100 ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. అయితే, విద్యాసంస్థ వెబ్సైట్ ద్వారా లేదా క్యాంపస్‌లో ఉన్న POS మెషీన్ ద్వారా చెల్లింపు జరిగితే ఈ ఫీజు వర్తించదు. ఈ మార్పు తల్లిదండ్రులు, విద్యార్థులపై కొంత భారం పెంచే అవకాశం ఉంది.
అదేవిధంగా, ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్ వాలెట్లకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా రూ.1,000 కంటే ఎక్కువ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలంటే ఇకపై 1 శాతం అదనపు ఫీజు చెల్లించాలి. ఉదాహరణకు రూ.2,000 వాలెట్లో జమ చేస్తే అదనంగా రూ.20 రుసుము వర్తిస్తుంది. డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరుగుతున్న ఈ సమయంలో ఈ నిర్ణయం వాడుకదారులకు కొత్త ఖర్చులను తెచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా, ఎస్బీఐ కార్డు ద్వారా ATMలో క్యాష్ విత్‌డ్రా చేసుకునే వారిపై 2.5 శాతం ఛార్జీ కూడా అమల్లోకి వస్తుంది.
ఇక కార్డు రీప్లేస్మెంట్, లేట్ పేమెంట్ ఫీజులు కూడా పెరిగాయి. నవంబర్ 1 నుంచి సాధారణ రీప్లేస్మెంట్ ఫీజు రూ.100 నుండి రూ.250కు పెరిగింది. Aurum కార్డులకైతే ఈ ఫీజు రూ.1,500గా నిర్ణయించారు. విదేశాల్లో కార్డు రీప్లేస్ చేసుకోవాలంటే వీసా కార్డులకు 175 డాలర్లు, మాస్టర్ కార్డులకు 148 డాలర్ల ఫీజు ఉంటుంది. బిల్లులు ఆలస్యంగా చెల్లించినపుడు రూ.500లోపు బిల్లులకు ఎలాంటి ఫైన్ ఉండదు. కానీ రూ.500–₹1,000 మధ్య బిల్లులకు రూ.400, ₹1,000–₹10,000 మధ్యకు ₹750, ₹10,000–₹25,000 మధ్యకు ₹950, ₹25,000–₹50,000 మధ్యకు ₹1,100, ₹50,000 పైన ఉన్న బిల్లులకు ₹1,300 ఫైన్ విధించబడుతుంది. మొత్తంగా చూస్తే, కొత్త ఫీజు విధానంతో వినియోగదారులు తమ లావాదేవీలను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
         
         
         
         
         
         
        