Tamil Nadu Elections 2026: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు శరవేగంగా మారుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయం గురించి స్పష్టం చేశారు. గత కొన్నాళ్లుగా సాగుతున్న పొత్తుల ఊహాగానాలకు తెరదించుతూ, 2026 ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన ప్రకటించారు. ఏ పార్టీతోనూ రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజల నమ్మకమే తమకు ప్రధాన బలమని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మమల్లాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయ్, తన రాజకీయ లక్ష్యాలను కుండబద్దలు కొట్టారు. లౌకికవాదం, సామాజిక న్యాయం అనేవి తమ పార్టీకి రెండు కళ్లు అని, కేవలం అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టలేమని చెప్పారు. ఢిల్లీ పాలకుల ఒత్తిళ్లకు లొంగేది లేదని, తమిళ ప్రజల ఆత్మగౌరవమే తమ నినాదమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాల మద్దతు కూడగట్టేలా ఆయన ప్రసంగం సాగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయ్ నిర్ణయం వెనుక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టీవీకేకు భారీ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 90 సీట్లతో పాటు రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవిని పంచుకుందామనే ప్రతిపాదనలు కూడా వచ్చాయట. కానీ, అడ్డదారిలో పదవులు దక్కించుకోవడం కంటే, స్వతంత్రంగా ప్రజల మనసు గెలవడమే ముఖ్యమని విజయ్ భావిస్తున్నారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు, టీవీకే వ్యూహకర్తలు క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంతో నిరాశ చెందిన వర్గాలను తమవైపు తిప్పుకోవాలని విజయ్ టీమ్ భావిస్తోంది. యువత మహిళా ఓటర్లే లక్ష్యంగా కొత్త తరహా ప్రచారానికి పార్టీ సిద్ధమవుతోంది.
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీలు ఉండగా, విజయ్ ఒంటరి పోరు ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం. అధికారం పక్షంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీవీకే భావిస్తోంది. ఏది ఏమైనా, విజయ్ ఎంట్రీతో తమిళ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ముక్కోణపు పోటీ నెలకొంటే సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి