దేవుడి సొమ్ముపై రాజకీయాలా?
వైసీపీ వైఖరిని ఎండగట్టిన ప్రత్తిపాటి పుల్లారావు…
ఒక వ్యక్తి తప్పును ప్రభుత్వానికి అంటగడతారా?
Andhra Politics: శ్రీవారి పరకామణిలో జరిగిన బంగారం చోరీ ఉదంతంపై టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ వైసీపీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. వైసీపీ తన రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఒక కాంట్రాక్టు ఉద్యోగి చేసిన వ్యక్తిగత నేరాన్ని ప్రభుత్వానికి అంటగట్టేలా కొన్ని అవినీతి పత్రికలు కల్పిత కథలు అల్లుతున్నాయని, ఇది వారి నీచ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. దేవుడి సొమ్ముపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని భక్తులు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
ఈ కేసు వివరాలను వివరిస్తూ, తిరుపతికి చెందిన పెంచలయ్య అనే వ్యక్తి గత రెండేళ్లుగా పరకామణిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడని ఎమ్మెల్యే తెలిపారు. అతను శ్రీవారి హుండీ కానుకల నుంచి ఒక బంగారు బిస్కెట్‌ను తస్కరించి, ఎవరికీ అనుమానం రాకుండా చెత్త తరలించే ట్రాలీలో దాచి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే టీటీడీ అప్రమత్తత వల్ల అతను సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇది వ్యవస్థాగత లోపం కాదని, ఒక వ్యక్తి చేసిన దొంగతనమని, దానిని టీటీడీనే స్వయంగా బయటపెట్టిందని పుల్లారావు స్పష్టం చేశారు.
నిందితుడు పట్టుబడిన వెంటనే టీటీడీ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. పెంచలయ్యను వెంటనే పోలీసులకు అప్పగించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని, దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని తెలిపారు. ఆనాడే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారని, నిందితుడి నుంచి తస్కరించిన బంగారాన్ని కూడా రికవరీ చేశారని చెప్పారు. ఇలా టీటీడీ పారదర్శకతతో వ్యవహరిస్తుంటే, వైసీపీ మాత్రం దానిని తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాడుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా అనేక అక్రమాలు జరిగాయని, వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రత్తిపాటి విమర్శించారు. గత ప్రభుత్వంలో పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ, లడ్డూ కల్తీ వంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు చిన్నపాటి ఘటనలను కూడా భూతద్దంలో చూపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాల కోసం పవిత్ర క్షేత్రాన్ని వివాదాల్లోకి లాగడం వైసీపీకి పరిపాటిగా మారిందని ఆయన ఆక్షేపించారు.