- జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 167A పనుల పురోగతిపై మంత్రి ఆరా..
- రూ.180కోట్లతో రైల్వే బ్రిడ్జి పనులు..
Kolusu Parthasarathy Special Focus: బాపట్లజిల్లా అభివృద్ధిపై ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి గారు ప్రత్యేక దృష్టి సారించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సచివాలయంలోని తమ కార్యాలయంలో ఎం.పీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని కలెక్టర్ వివరించారు. రానున్న వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించడం ప్రధాన అంశంగా చర్చించారు. నల్లమడ డ్రెయిన్ ఆధునీకరణ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నెలకొల్పేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 167A పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. జాతీయ రహదారి 167A పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తికానున్నాయని వివరించారు. అదేవిధంగా గుంటూరు, నారా కోడూరు, తెనాలి, చందోలు, నిజాంపట్నం పోర్టుకు సంబంధించిన రోడ్డు డీపీఆర్ దశలో ఉందని అధికారులు వివరించారు. రూ.180కోట్లతో రైల్వే బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ శాఖలకు సంబంధించి జిల్లాలో పురోగతి అంశాలపై మంత్రి చర్చించారు.
జిల్లాలో శాంతిభద్రతలపై ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని, నేరస్తులపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎం.పీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశ్న నరేంద్ర వర్మ, నక్కా ఆనంద్ బాబు, ఎం.మాలకొండయ్య, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.