Anakapalli Steel Plant: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమగా పేరుగాంచిన 'అర్సెలార్ మిత్తల్' స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేసే విధంగా విశాఖ ఉక్కు కంటే పెద్దదైన పరిశ్రమ ఇక్కడ కొలువుదీరబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన 'స్టీల్ సిటీ'కి పునాది అని ఆయన అభివర్ణించారు.
సుమారు 5,465 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. రెండు దశల్లో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు నుంచి 2028 డిసెంబర్ నాటికి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్‌ను ఆయన అభినందించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి పనికి బేషరతుగా మద్దతు ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పరిశ్రమల స్థాపన కోసం భూములిచ్చిన రైతుల పట్ల ముఖ్యమంత్రి కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో భూసేకరణ పూర్తి చేశామని, ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. "ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు సూత్రాలతో గడిచిన 20 నెలల్లో ఎన్నో రికార్డులను సృష్టించాం" అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న పూర్తి సహకారం వల్లే ఇటువంటి మెగా ప్రాజెక్టులు సాధ్యమవుతున్నాయని గుర్తుచేశారు.
రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై మాట్లాడుతూ.. కేవలం 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాకుండా, ఇప్పుడు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' వైపు వెళ్తున్నామని బాబు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, రాబోయే మూడేళ్లలో 22 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఏపీలో ఉన్న వనరులను చూసి పెట్టుబడిదారులు ఇక్కడికి తరలివస్తున్నారని, భవిష్యత్తులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను మూడు ప్రధాన హబ్‌లుగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా మార్చడమే కాకుండా, దీనిని 'రేర్ ఎర్త్ మినరల్స్' హబ్‌గా తయారు చేస్తామన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నామని కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోయి, ఆర్థికంగా బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ముగించారు.