చెప్పిన మాట ప్రకారం వంశీకృష్ణ రాక
వర్షం సాకుతో కాలయాపన?
రాత్రి వేళ వీడియోతో ప్రత్యక్షం
TDP vs YCP: : గత శుక్రవారం ఉదయం 'ప్రైమ్ 9' న్యూస్ ఛానల్ నిర్వహించిన 'హాట్ టాపిక్' చర్చా కార్యక్రమంలో అమరావతి రాజధాని అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ డిబేట్‌లో వైసీపీ ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి మాట్లాడుతూ.. అమరావతిలో అసలు పనులే జరగడం లేదని, బయట వ్యక్తులను లోపలికి రానివ్వడం లేదని ఆరోపించారు. ఒకవేళ అభివృద్ధి జరుగుతుంటే చూపించాలని, తాను ప్రత్యక్షంగా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ వెంటనే స్వీకరించారు. అక్కడికక్కడే సమయం కూడా ఖరారైంది.
మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి వస్తానని నాగమల్లేశ్వరి చెప్పడంతో, బండారు వంశీకృష్ణ సరిగ్గా అదే సమయానికి అమరావతిలోని సీఆర్డీఏ (CRDA) కార్యాలయానికి చేరుకున్నారు. తన ఫోన్ నంబర్‌ను కూడా డిబేట్ లోనే బహిరంగంగా ప్రకటించిన వంశీకృష్ణ, ఆమె రాక కోసం ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియో ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం 4 గంటలకు డిబేట్ నిర్వాహకుడు రాజు కూడా అక్కడికి చేరుకున్నారు.
వంశీకృష్ణ అక్కడ వేచి ఉండగా.. నాగమల్లేశ్వరి ఫోన్ చేసి వర్షం కారణంగా ఆలస్యమవుతోందని, మరో అరగంటలో వస్తానని చెప్పారు. అయితే గంటలు గడుస్తున్నా ఆమె రాలేదు. 6:30 గంటల సమయంలో వంశీకృష్ణ, మోడరేటర్ రాజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. చివరకు రాత్రి 7 గంటల వరకు వేచి చూసిన వంశీకృష్ణ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికి ఆయన అక్కడి నుండి వెనుతిరిగారు.
అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో, రాత్రి 8 గంటల తర్వాత నాగమల్లేశ్వరి ఒక వీడియోను విడుదల చేశారు. తాను అమరావతికి వచ్చానని అందులో పేర్కొన్నారు. అయితే, సవాల్ విసిరిన సమయానికి రాకుండా, ఎదుటి పక్షం నేతలు వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా వచ్చి వీడియోలు పెట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "చర్చకు పిలిచి ముఖం చాటేయడం ఎందుకు?" అని కొందరు ప్రశ్నిస్తుంటే, వైసీపీ కావాలనే విషప్రచారం చేస్తోందని మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి అమరావతి కేంద్రంగా జరిగిన ఈ 'ఛాలెంజ్' రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.