- రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష…
- పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ పెంచేలా కార్యాచరణ..
Andhrapradesh Chandrababu Meeting About LPG gas: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 15 రోజులకు సరిపడా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ ఉంటే.. అదనంగా మరో 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ విశాఖలో అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరా, సిలెండర్ల పంపిణీ, పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ సహా వివిధ అంశాలపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఏపీలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులూ లేవని సీఎం స్పష్టం చేశారు.
ఈకేవైసీ, ఓటీపీల సాయంతో గ్యాస్ సిలెండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా చూడాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్యాస్ కంపెనీలు స్వల్ప కాలికంగా ఉత్పత్తి పెంచటంతో పాటు పంపిణీ కూడా మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. ప్రత్యేకించి గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపైనా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్ ల స్టాక్స్ లభ్యతను కూడా తెలుసుకోవాలని సూచించారు.
పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ విస్తృతికి చర్యలు
ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు, నెట్వర్క్ పెంపు పైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మరింతగా విస్తరించే అంశంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో ఎల్ఎన్ జీని ఏపీకి కేటాయించేలా చేసుకుని 2 సీజన్లలో పైప్ ద్వారా కొండపల్లి వరకూ తీసుకు రాగలిగామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎనర్జీ ట్రాన్సిషన్ జరిగేలా వ్యయం తక్కువ అయ్యే ఇంధనాన్ని వినియోగదారులకు అందించాల్సి ఉందని స్పష్టం చేశారు.
పైప్డ్ గ్యాస్ సరఫరాకు సంబంధించి తక్షణం చేయగలమన్న అంశంపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఏజీ అండ్ పీ, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్, జీజీపీఎల్, ఐఓసీఎల్, మెఘా గ్యాస్ లు సహజ వాయువును సరఫరా చేస్తున్నాయని అధికారులు వివరించారు. 198 సీఎన్జీ స్టేషన్ల ద్వారా ఈ సరఫరా జరుగుతోందని తెలిపారు. 1.68 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఇచ్చేలా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం సీఎన్జీ, పీఎన్జీ నెట్వర్క్ ను మరింత విస్తృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అమరావతితో పాటు పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. మౌలిక సదుపాయాల ను పెంచేందుకు వీలుగా పెట్రోలియం కంపెనీలు కూడా సహకరించేలా కేంద్రంతో సంప్రదింపులు చేయాలన్నారు.
త్వరలో ఏపీ వన్ యాప్ ద్వారా సేవలు
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వాహనదారులను సెన్సిటైజ్ చేయాలని సీఎం సూచించారు. సిటిజన్ సేఫ్టీ అవేర్‌నెస్ కింద వారికి సంక్షిప్త సమాచారాన్ని పంపించాలని అన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు లింక్ ను యాప్ ద్వారా లేదా వాట్సప్ గవర్నెన్సు ద్వారా వినియోగదారులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రూపోందిస్తున్న ఏపీ వన్ యాప్ ను త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్నారు. డేటా లేక్, అవేర్ ను ప్రభుత్వ శాఖలు ఏమేరకు వినియోగించుకున్నది గుర్తించాలని సీఎం సూచించారు. వేసవిలో అవేర్ ద్వారా సమాచారం తీసుకుని తాగునీరు, హీట్ వేవ్స్, పశుగ్రాసం సహా వివిధ అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
మహిళలపై నేరాలు, డ్రగ్స్ నియంత్రణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేలా ప్రజల్లో విస్తృతమైన మార్పు వచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. గ్రామాల్లో వ్యర్ధాలను తొలగించి చెత్తను వర్గీకరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణాల నుంచి వచ్చే వ్యర్ధాలను సర్క్యులర్ ఎకానమీకి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఐఅండ్ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పంచాయితీరాజ్, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, సురేశ్ కుమార్, దేవాదాయశాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, వివిధ పెట్రోలియం కంపెనీలు, గెయిల్, ఓఎన్జీసీ ప్రతినిధులు హాజరయ్యారు.