అమెరికాలో తెలుగు సంస్కృతి వైభవానికి ప్రతీకగా మాటా 2026..
మాటా మహాసభలో జయప్రద, సుమ, దేవి శ్రీ ప్రసాద్ సందడి..
ఫిలడెల్ఫియా: అమెరికాలోని తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక సంస్థ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్వితీయ జాతీయ మహాసభకు సర్వం సిద్ధమైంది. జూన్ 19, 20 తేదీలలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్, ఓక్స్‌లో ఈ మహాసభను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అమెరికా నలుమూలల నుంచి 5,000 నుంచి 7,000 మంది వరకు తెలుగు ప్రజలు ఈ మహాసభకు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సేవ, యువత అభివృద్ధి, కమ్యూనిటీ ఐక్యత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ రెండు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద హాజరుకానున్నారు. అలాగే ప్రముఖ యాంకర్ సుమ కనకాల, గాయని సమీరా భారద్వాజ్, నటి ఐశ్వర్య రాజేష్, రీటా, హీరో నిఖిల్, నటుడు అలి, రామచారి, స్వాతి రెడ్డి తదితర సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని సందడి చేయనున్నారు.
వినోద కార్యక్రమాలు కూడా ఈ మహాసభలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన సంగీత విభావరితో ప్రేక్షకులను అలరించనుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రాండ్ ఫినాలే కాన్సర్ట్ సభకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది.
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక, విద్యా, వృత్తిపరమైన అంశాలకు సంబంధించిన పలు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణం, యూత్ ఫోరం, పాలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, లీగల్ ఫోరం, సీఎంఈ సెషన్లు, అలుమ్నీ సమావేశాలు, మ్యాట్రిమోనీ ఫోరం, ఏఐ హ్యాకథాన్, మాటా సింగింగ్ స్టార్ పోటీలు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
మహాసభలో భాగంగా 100కు పైగా వ్యాపార, ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సందర్శకులకు షాపింగ్ అవకాశాలతో పాటు వ్యాపార సంబంధాలు పెంపొందించుకునే అవకాశం కూడా లభించనుంది. వ్యాపారవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు, ఉద్యోగ నిపుణులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉండటంతో నెట్‌వర్కింగ్‌కు ఇది మంచి వేదికగా మారనుంది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు, ప్రవాస తెలుగు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని తెలుగు ప్రజలకు ఈ కార్యక్రమం ఒక చిరస్మరణీయ అనుభూతిగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.