ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ పై కఠిన చర్యలు..
కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు..
ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో క్రికెట్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. విజయవాడ నగరంలో బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సైబర్‌క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. నలుగురు ఏసీపీలతో కలిసి ప్రత్యేకంగా ఈ ఆపరేషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
పోలీసులు ఇప్పుడు కేవలం బయట జరుగుతున్న బెట్టింగ్‌కే కాకుండా, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండింటిపైనా దృష్టి పెట్టారు. సైబర్ బృందాలు రంగంలోకి దిగి డార్క్ వెబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అనుమానాస్పద లావాదేవీలను విశ్లేషిస్తూ, బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని గుర్తించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు యువతకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. “బెట్టింగ్ మాయలో పడితే భవిష్యత్తు నాశనం అవుతుంది. తాత్కాలిక లాభాల కోసం జీవితాన్ని ప్రమాదంలో పడేయొద్దు” అని హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు జాగ్రత్తగా నిఘా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద మార్పులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వారు ‘డయల్ 100/112’కు ఫోన్ చేసి తెలియజేయాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు విజయవాడ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం గమనార్హం.