Helping Hand: బాబు పుట్టినరోజున 'https://www.andhrapravasi.comఅండగా' నిలిచిన ఎన్నారైలు…
కార్యకర్త ప్రాణం కోసం... కువైట్ టీడీపీ సేవా యజ్ఞం!
తెలంగాణ తమ్ముడికి గల్ఫ్ భరోసా: ₹1.21 లక్షల సాయం అందజేత….
Nri Tdp Kuwait: రాజకీయాలంటే కేవలం అధికారం, విమర్శలే కాదని.. ఆపదలో ఉన్న తోటి కార్యకర్తను ఆదుకోవడంలోనే అసలైన మానవత్వం ఉందని ఎన్నారై తెలుగుదేశం కువైట్ విభాగం నిరూపించింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా జరిపి, ఆ నిధులను క్యాన్సర్తో పోరాడుతున్న ఒక సామాన్య కార్యకర్త ప్రాణాలను కాపాడేందుకు మళ్లించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగుదేశం పార్టీకి కువైట్ ఒక కంచుకోట అని ఈ చర్య ద్వారా మరోసారి స్పష్టమైంది.
తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త వి. శ్రీశైలం గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, విధివశాత్తు ఆయన క్యాన్సర్ బారిన పడటంతో వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు మరియు కువైట్ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు వెంటనే స్పందించి, ఆయనకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
అపర చాణక్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సాధారణంగా నిర్వహించే కేక్ కటింగ్లు, భారీ ర్యాలీలకు స్వస్తి పలికారు. ఆ వేడుకల కోసం కేటాయించిన నిధులతో పాటు, కమిటీ సభ్యుల సహకారంతో మొత్తం ₹1,21,900/- (ఒక లక్ష ఇరవై ఒక్క వేయ్యి తొమ్మిది వందల రూపాయలు) సేకరించారు. ఈ మొత్తాన్ని శ్రీశైలం గారి వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సాయంగా అందజేసి, సేవే మార్గమని చాటారు.
ఈ సందర్భంగా కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ, అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి జన్మదినం నాడు ఒక నిరుపేద కార్యకర్తకు సాయం చేయడం కంటే మించిన వేడుక మరొకటి లేదని అభిప్రాయపడ్డారు. పార్టీ పట్ల నిబద్ధత కలిగిన శ్రీశైలం గారు త్వరగా కోలుకుని, మళ్ళీ ప్రజాక్షేత్రంలో యాక్టివ్గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకున్న దాతలందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
కువైట్ టీడీపీ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలే తమ వెన్నెముక అని, వారి కష్టాల్లో తోడుండటం ప్రతి సభ్యుని బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సాయం అందించడంలో రషీదా భేగం, బిల్లా రమేష్ యాదవ్, కుసుమే కుటుంబ రావు, షేక్ బాషా, లాస్య మొబైల్స్ అధినేత తదితరులు చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు. కువైట్ గడ్డపై తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తూనే, సేవా పథంలోనూ గల్ఫ్ టీడీపీ ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు.