ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులకు అనుమతుల పై సమీక్ష..
ఈనెల 23 తో ముగుస్తున్న లేఅవుట్ క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు..
అమరావతిలో పట్టణ అభివృద్ధి పనులపై ప్రభుత్వం మరింత వేగం పెంచింది. ఈ నేపథ్యంలో మంత్రి పీ నారాయణ టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తుల అనుమతులపై విస్తృతంగా సమీక్ష చేపట్టారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిస్థితిని మంత్రి వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు అర్హత ఉన్న అన్ని దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే ఆమోదించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్ అప్లికేషన్లను తక్షణమే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా పారదర్శకంగా, వేగంగా ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అధికారుల బాధ్యత అని గుర్తు చేశారు.
ఇక లేఅవుట్ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 23తో ముగియనున్న నేపథ్యంలో, ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రజలకు ఊరటనివ్వాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సమీక్షతో స్పష్టమైంది.