సీనియర్ సిటిజన్లు మరియు తక్కువ మొబైల్ డేటా వాడేవారికి అనుకూలమైన రీఛార్జ్ ప్లాన్ల అవసరం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ప్రముఖ టెలికం కంపెనీలు అయిన Airtel మరియు Jioలకు నెటిజన్లు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. వారు చెబుతున్నది ఒక్కటే మాకు అంతగా డేటా అవసరం లేదు, కానీ వాయిస్ కాల్స్ మాత్రం కావాలి. కాబట్టి డేటా లేకుండా తక్కువ ధరలో వాయిస్ ఓన్లీ ప్లాన్లు ఇవ్వండి అని కోరుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెలికం ప్లాన్లలో చాలా వరకు “డేటా + వాయిస్ + ఎస్‌ఎంఎస్” బండిల్డ్ ప్యాకేజీలుగా వస్తున్నాయి. అంటే, కేవలం ఫోన్ కాల్స్ చేసేవారికి లేదా ఎక్కువగా WiFi వాడేవారికి కూడా డేటా కోసం అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇది పెద్ద భారంగా మారింది. వారు ఎక్కువగా మొబైల్‌ను కేవలం మాట్లాడటానికి లేదా మెసేజ్‌లు పంపటానికి మాత్రమే వాడుతుంటారు.
ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువగా ఉండే ఈ వర్గం కోసం ప్రత్యేకమైన వాయిస్ ఓన్లీ లేదా లైట్ డేటా ప్లాన్లు ఉంటే చాలా సౌలభ్యం కలుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “ప్రతి నెల రూ.100లోపు లేదా వార్షికంగా రూ.1000లోపు ప్లాన్ ఉంటే చాలు. డైలీ 1GB డేటా లేదా కేవలం కాలింగ్ సదుపాయం ఉంటే సరిపోతుంది” అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.
మేము ఎక్కువగా ఇంట్లో WiFi వాడుతాం. ఫోన్ డేటా చాలా అరుదుగా ఉపయోగిస్తాం. కానీ రీఛార్జ్ చేయకపోతే కాల్ సేవలు ఆగిపోతాయి. అందుకే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు ఉండాలి.”
కొంతమంది BSNLని ఉదాహరణగా చూపిస్తూ, “BSNLలో ఇప్పటికీ తక్కువ ధరకు కాలింగ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ Airtel, Jioలో అలాంటి చౌక ప్లాన్లు లేవు. కేవలం డేటా ఆధారిత వినియోగదారుల కోసం మాత్రమే ప్యాకేజీలు రూపొందిస్తున్నారు” అని వ్యాఖ్యానిస్తున్నారు.
టెలికం రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సరికొత్త వాయిస్ ఓన్లీ లేదా లైట్ యూజర్ ప్లాన్లు ప్రవేశపెట్టడం Airtel, Jioలకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తక్కువ డేటా వాడే వినియోగదారులు కూడా ఉన్నత ప్లాన్లకే పరిమితమవుతున్నారు.
ఈ నేపధ్యంలో Airtel మరియు Jio తమ రీఛార్జ్ స్ట్రక్చర్‌లో మార్పులు చేసి, వేర్వేరు వయస్సు వర్గాలకు సరిపడే రీఛార్జ్ ఎంపికలు తీసుకురావాలని యూజర్లు కోరుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సులభమైన, చౌకైన వాయిస్ ప్లాన్లు అందిస్తే, వారు కూడా సౌకర్యవంతంగా మొబైల్ సేవలను వినియోగించుకోగలరని నెటిజన్ల అభిప్రాయం. డేటా అవసరం లేని వారికి డేటా కోసం చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదు. అనే వినియోగదారుల విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చనీయాంశమైంది. Airtel, Jio ఈ పిలుపుకు ఎలా స్పందిస్తాయో చూడాలి.