టెక్ ప్రపంచంలో మరో సెన్సేషన్ సృష్టించిన గూగుల్, తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ అనే ఈ వినూత్న ప్రయోగం ద్వారా గూగుల్ భూమికి వెలుపలే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనే మిషన్‌ను ప్రారంభించింది. సౌరశక్తితో నడిచే ఉపగ్రహాలను ఆధారంగా చేసుకుని ఏఐ ప్రాసెసింగ్‌ను అంతరిక్షంలో నిర్వహించాలన్న గూగుల్ ఆలోచన ప్రపంచ టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సంస్థ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచి, పర్యావరణానికి భారం కాకుండా కొత్త దిశను చూపనుంది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ తన అత్యాధునిక టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు (TPUs) అంతరిక్షంలో అమర్చనుంది. చిన్న పరిమాణంలో ఉన్న సౌరశక్తి ఆధారిత ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి, వాటిని ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ లింక్స్ ద్వారా పరస్పరంగా అనుసంధానించనుంది. ఈ విధంగా ఏర్పడే ఉపగ్రహ సమూహం ఏఐ డేటా సెంటర్‌లుగా పనిచేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘ప్లానెట్’ అనే ఉపగ్రహ సాంకేతిక సంస్థ భాగస్వామ్యమవుతోంది. 2027 నాటికి తొలి రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే గూగుల్ తదుపరి లక్ష్యమని సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
"మా టీపీయూలు ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి" అని పిచాయ్ తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, ఆటోనమస్ డ్రైవింగ్ వంటి తమ మూన్‌షాట్ ప్రాజెక్టుల మాదిరిగానే, ‘సన్‌క్యాచర్’ కూడా భవిష్యత్తు సాంకేతికతలో విప్లవాత్మక మార్పుకు దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతరిక్షంలో సౌరశక్తిని పూర్తిగా వినియోగించి, నిరంతర విద్యుత్ సరఫరాతో ఏఐ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని గూగుల్ భావిస్తోంది. భూమిపై పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, పర్యావరణ దుష్ప్రభావాలను తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రధాన ఉద్దేశ్యం. భూమి కక్ష్యలో ఉన్న సోలార్ ప్యానెల్లు భూమిపైనివాటితో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయగలవని గూగుల్ తెలిపింది.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో అనేక సాంకేతిక సవాళ్లు ఉన్నాయని సంస్థ అంగీకరించింది. ముఖ్యంగా రేడియేషన్, థర్మల్ మేనేజ్‌మెంట్, సిస్టమ్ విశ్వసనీయత వంటి అంశాల్లో భూమిపై ఉన్న సదుపాయాలకంటే అంతరిక్షంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయని తెలిపింది. అయినప్పటికీ, తమ తాజా ట్రిలియం జనరేషన్ టీపీయూలు అంతరిక్ష రేడియేషన్‌ను తట్టుకోగలవని పరీక్షల్లో నిరూపించుకున్నట్లు వెల్లడించింది. గూగుల్ విశ్లేషణ ప్రకారం, భవిష్యత్తులో ఏఐ ఆధారిత వ్యవస్థల శక్తి వినియోగాన్ని సుస్థిరంగా ఉంచాలంటే అంతరిక్ష డేటా సెంటర్‌లు ఉత్తమ పరిష్కారంగా నిలుస్తాయి. ఈ దిశగా గూగుల్ ఇప్పటికే విస్తృత పరిశోధనలను ప్రారంభించి, అంతరిక్షంలో ఏఐ విప్లవానికి నాంది పలుకుతోంది.