శ్రీకాకుళం జిల్లాలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ పర్యటన..
రాజాంలో డంపింగ్ యార్డ్ పరిశీలించిన ఛైర్మన్ పట్టాభి..
శ్రీకాకుళం: రాష్ట్రాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. రాజాం పట్టణంలోని డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పూర్తిగా డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చెత్తను కేవలం పారేయడం కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి పర్యావరణానికి హాని లేకుండా నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.530 కోట్ల వ్యయంతో 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాజాంలో ఒక ఎకరం స్థలంలో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టామని వివరించారు. ఈ కేంద్రాన్ని రూ.1.62 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి రోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజున ప్రాసెస్ చేసే విధంగా ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నామని పట్టాభి పేర్కొన్నారు. దీంతో చెత్త పేరుకుపోవడం తగ్గి, పట్టణాలు మరింత పరిశుభ్రంగా మారుతాయని అన్నారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై వివరాలు అందించారు. ప్రజల సహకారం ఉంటే స్వచ్ఛాంధ్ర లక్ష్యం త్వరలోనే సాధ్యమవుతుందని ఛైర్మన్ పట్టాభి ఆశాభావం వ్యక్తం చేశారు.