Abroad Entrance Exams: ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామంది విద్యార్థులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లాలని అనుకుంటారు. కొత్త సంస్కృతులను చూడటమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న డిగ్రీని పొందాలనేది చాలామంది విద్యార్థుల కల. అయితే, విదేశాల్లోని మంచి యూనివర్సిటీల్లో సీటు సాధించడం కేవలం మార్కులతోనే సాధ్యం కాదు. దీనికోసం ఒక పక్కా ప్లానింగ్, సరైన ప్రవేశ పరీక్షల అవగాహన ఉండటం చాలా ముఖ్యం.
అడ్మిషన్ ప్రక్రియలో మీ మార్కులతో పాటు మీ వ్యక్తిత్వం, ప్రతిభను వివరించే ప్రొఫైల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ప్లానింగ్ ఉంటే ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో చదువుకోవడం కష్టమేమీ కాదు మీ అకడమిక్ ప్రతిభతో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లాజికల్ థింకింగ్‌ను కూడా గమనిస్తాయి. అందుకే అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా కొన్ని రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం తప్పనిసరి. మీరు ఎంచుకునే దేశం, కోర్సును బట్టి ఈ పరీక్షలు మారుతూ ఉంటాయి.
ముఖ్యంగా అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి ఇంగ్లీష్ మాట్లాడే దేశాలకు వెళ్లాలనుకునే వారు ముందుగా 'భాషా నైపుణ్య పరీక్షల'పై దృష్టి పెట్టాలి. వీటిలో ఐఈఎల్టీఎస్ (IELTS), టోఫెల్ (TOEFL) వంటివి ప్రధానమైనవి. ఈ పరీక్షలు మీరు ఇంగ్లీష్‌ను ఎంత బాగా చదవగలరు, రాయగలరు మాట్లాడగలరు అనే అంశాలను అంచనా వేస్తాయి. ఈ స్కోరు బాగుంటేనే విదేశాల్లో పాఠాలు అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుందని అక్కడి యాజమాన్యాలు నమ్ముతాయి.
ఇక డిగ్రీ కోర్సుల విషయానికి వస్తే.. ఎస్ఏటీ (SAT) లేదా ఏసీటీ (ACT) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇవి మీలోని మ్యాథ్స్ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. మీరు ఒకవేళ మేనేజ్మెంట్ లేదా బిజినెస్ కోర్సులు చేయాలనుకుంటే కొన్నిసార్లు జీమ్యాట్ (GMAT) వంటి పరీక్షల అవసరం పడవచ్చు. అలాగే మెడిసిన్ లేదా లా వంటి వృత్తి విద్యా కోర్సుల కోసం ఆయా దేశాలు నిర్వహించే ప్రత్యేక పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
విదేశీ అడ్మిషన్ ప్రక్రియలో కేవలం పరీక్షలే కాకుండా, మీ ప్రొఫైల్ కూడా బలంగా ఉండాలి. మీరు గతంలో సాధించిన విజయాలు, సామాజిక సేవలు, మీ లక్ష్యాలను వివరించే 'స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్' (SOP) వంటివి అడ్మిషన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, 12వ తరగతి నుంచే సరైన కోచింగ్ తీసుకుంటూ, ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు అనుకున్న విదేశీ విద్య కలని నిజం చేసుకోవచ్చు.