- చారిత్రక నేపథ్యంతో 'రణబాలి'.. సెప్టెంబర్ 11వ తేదీన విడుదల..
- విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక - సంగీతాన్ని అందించిన అజయ్ - అతుల్..
Vijay New Movie: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న 'రణబాలి' సినిమాపై ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత వెండితెరపై కలిసి కనిపిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. ఇటీవల వీరి పెళ్లి వేడుకను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేక సాంగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషమేమిటంటే, ఈ పాటను కూడా పెళ్లి నేపథ్యంలోనే అత్యంత సుందరంగా చిత్రీకరించారు.
'ఏందయ్యో సామి' అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీకి అజయ్ - అతుల్ ద్వయం అద్భుతమైన బాణీలను అందించారు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ పాట యూత్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. కేవలం పెళ్లి హడావిడి వల్లే ఈ పాట ట్రెండ్ అవుతోందని మొదట్లో కొందరు భావించినప్పటికీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ పాటలోని మధురమైన సాహిత్యం, చిత్రీకరణ ప్రేక్షకులను మరింతగా మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమ మెలోడీలలో ఒకటిగా దీనికి గుర్తింపు లభిస్తోంది.
కథాంశం పరంగా చూస్తే, ఇది ఆంగ్లేయుల కాలంలో వారి అరాచకాలను ఎదిరించి పోరాడిన ఒక ధీశాలియైన రాయలసీమ వీరుడి గాథ. ఈ చారిత్రక నేపథ్యంలో సాగే చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన భార్య 'జయమ్మ' పాత్రలో రష్మిక నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, భారీ నిర్మాణ విలువలతో రూపుదిద్దుకున్న 'రణబాలి' చిత్రాన్ని సెప్టెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.