ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..
విడుదలైన సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్న పైరసీ ముఠా..
తెలుగు సినీ పరిశ్రమకు మళ్లీ పైరసీ బెడద పెరుగుతోంది. ఇటీవల విడుదలైన సినిమాలు అక్రమంగా ప్రసారం చేస్తున్న ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లపై ఫిల్మ్ ఛాంబర్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల విడుదల వెంటనే వాటిని ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల నిర్మాతలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ వ్యవహారంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో ‘ఐ బొమ్మ’ నిర్వహణతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న రవి అనే వ్యక్తి తాజాగా స్పందించారు. ప్రస్తుతం నడుస్తున్న కొత్త ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తన పేరును ఉపయోగించుకుని కొందరు కేటుగాళ్లు కొత్త వెబ్‌సైట్‌ను సృష్టించి సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు.
ఇటీవల విడుదలైన పలు సినిమాలు ఈ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవడంతో సినీ పరిశ్రమలో ఆందోళన మరింత పెరిగింది. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ కాపీలు బయటకు రావడం వల్ల ప్రేక్షకులు కూడా అక్రమ లింకుల వైపు మొగ్గు చూపుతున్నారని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లపై కేసు నమోదు చేశారు. ఈ వెబ్‌సైట్ల నిర్వహకులు ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.