Business- రూ. 859 ప్లాన్ ఇకపై రూ. 899: ఎయిర్టెల్ కీలక నిర్ణయం.
84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై రూ. 40 భారం.. అమల్లోకి వచ్చిన కొత్త ధరలు.
ఎయిర్టెల్ రూ. 799 ప్లాన్ మాయం.. ధరల పెంపుతో వినియోగదారుల బేజార్.
Airtel Recharge Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాక్ ఇస్తూ కీలకమైన ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. గత కొంతకాలంగా టెలికాం రంగంలో నెలకొన్న పోటీ, పెరిగిన నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఎంచుకునే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను పెంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంస్థ తన సగటు ఆదాయాన్ని (ARPU) మెరుగుపరుచుకోవడంలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో రూ. 859 గా ఉన్న ఈ ప్లాన్ ధరను ఎయిర్టెల్ ఇప్పుడు రూ. 899కి పెంచింది. అంటే నేరుగా వినియోగదారులపై రూ. 40 అదనపు భారం పడనుంది. అయితే ధర పెరిగినప్పటికీ, ఈ ప్లాన్ ద్వారా లభించే డేటా, కాలింగ్ ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎయిర్టెల్ వెబ్సైట్ మరియు యాప్‌లో ఇప్పటికే ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. దీనితో పాటు ఎంతో కాలంగా అందుబాటులో ఉన్న రూ. 799 ప్లాన్‌ను కంపెనీ పూర్తిగా తొలగించడం గమనార్హం.
ఈ ప్లాన్ ప్రయోజనాలను పరిశీలిస్తే, వినియోగదారులకు 84 రోజుల పాటు రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా అందుతాయి. డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbps కి తగ్గుతుంది. 5G ఫోన్ వాడే వారికి, నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5G డేటా ఆఫర్ కూడా ఈ ప్లాన్‌తో కలిపి లభిస్తుంది.
అదనపు ప్రయోజనాల కింద ఎయిర్టెల్ వినియోగదారులకు 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం (Adobe Express Premium) సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. దీంతో పాటు ఉచిత హెలోట్యూన్స్, స్పామ్ అలర్ట్స్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. అయితే గతంలో ఈ ప్లాన్‌తో లభించే రివార్డ్స్ మినీ (RewardsMini) మెంబర్‌షిప్‌ను ఇప్పుడు కంపెనీ తొలగించింది. అంటే ధర పెరగడమే కాకుండా, కొన్ని ప్రయోజనాలు తగ్గడం వినియోగదారులకు కాస్త నిరాశ కలిగించే విషయమే.
ప్రస్తుతం టెలికాం మార్కెట్లో జియో మరియు వోడాఫోన్ ఐడియా (Vi) వంటి కంపెనీలు కూడా తమ ప్లాన్ల ధరలను సవరిస్తున్నాయి. జియో తన 84 రోజుల ప్లాన్‌ను రూ. 799 కే అందిస్తుండగా, ఎయిర్టెల్ ధర ఇప్పుడు రూ. 899కి చేరింది. భవిష్యత్తులో మరిన్ని ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు తమ బడ్జెట్‌కు తగిన ప్లాన్‌ను ఎంచుకోవడానికి ఈ మార్పులను గమనించడం అవసరం.