MATA: ప్రవాస భారతీయుల కోసం MATA నెలవారీ న్యాయ సదస్సు! కీలక అంశాలపై అవగాహన!

Mana American Telugu Association (MATA): మన అమెరికా తెలుగు సంఘం (MATA) సామాజిక బాధ్యతలో భాగంగా ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా నెలవారీ న్యాయ సదస్సు (లీగల్ సెమినార్) నిర్వహిస్తోంది.

Published : 2026-04-12 14:07:00

2026 ఏప్రిల్ 25వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 1:30 గంటల వరకు..

వలస సంబంధిత సమస్యలపై అవగాహన..

మన అమెరికా తెలుగు సంఘం (MATA) సామాజిక బాధ్యతలో భాగంగా ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా నెలవారీ న్యాయ సదస్సు (లీగల్ సెమినార్) నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2026 ఏప్రిల్ 25వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 1:30 గంటల వరకు ఆన్‌లైన్ వేదికగా జరగనుంది. ముఖ్యంగా దక్షిణాసియా కమ్యూనిటీ ఎదుర్కొంటున్న న్యాయ, వలస సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే ఈ సెమినార్ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ సదస్సులో మూడు ముఖ్యమైన అంశాలపై నిపుణులు వివరంగా చర్చించనున్నారు. ముందుగా దక్షిణాసియా కుటుంబాలు ఎదుర్కొంటున్న ఫ్యామిలీ లా సవాళ్లపై అవగాహన కల్పిస్తారు. తదుపరి ఫ్యామిలీ బేస్డ్ ఇమ్మిగ్రేషన్‌లో జరుగుతున్న తాజా మార్పులు, హ్యూమానిటేరియన్ వీసా మార్గాలపై వివరాలు అందించనున్నారు. మూడో అంశంగా హెచ్-1బి క్యాప్ ఫైలింగ్స్, వీసా అపాయింట్‌మెంట్లు, ఎఫ్-1 ఓపీటీ/సీపీటీ మార్పులపై తాజా అప్‌డేట్స్‌ను తెలియజేస్తారు. ఈ అంశాలు ప్రస్తుతం చాలా మంది ప్రవాసులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలే కావడంతో ఈ సదస్సు వారికి ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి రాజన్ లీగల్ పీసీ వ్యవస్థాపకులు మహేష్ రాజన్ (Esq), సీనియర్ అసోసియేట్ అస్మా వార్సీ ముఖ్య వక్తలుగా పాల్గొననున్నారు. తమ అనుభవంతో కమ్యూనిటీ సభ్యుల సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ సదస్సుకు ప్రేమా రొద్దం మోడరేటర్‌గా వ్యవహరించగా, కళ్యాణి బెల్లంకొండ లీగల్ సెమినార్ కోఆర్డినేటర్‌గా, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఉచిత సదస్సులో పాల్గొనదలిచిన వారు నిర్దేశించిన జూమ్ లింక్ ద్వారా చేరవచ్చు. మరిన్ని వివరాల కోసం MATA హెల్ప్‌లైన్ నంబర్లు లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. ప్రవాస తెలుగు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని న్యాయపరమైన అంశాలపై స్పష్టత పొందాలని మేటా కార్యవర్గం కోరుతోంది.

అలాగే, ఈ సందర్భంగా జూన్ 19 నుంచి 20 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న మేటా రెండో మహాసభల (MATA 2nd Convention) గురించి కూడా గుర్తు చేస్తూ, అందరూ భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Spotlight

Read More →