సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రుక్మిణీ వసంత్ ప్రస్తుతం సౌత్ సినిమాల్లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. 2019లో వచ్చిన “బీర్బల్” అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, 2023లో విడుదలైన “సప్త సాగరాలు దాటి” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. ఆ చిత్రం ద్వారా రుక్మిణీకి మంచి పేరు, గుర్తింపు లభించాయి. అందం, నైజం కలగలిపిన ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తర్వాత ఆమె తెలుగులో నిఖిల్ సరసన “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అయినప్పటికీ రుక్మిణీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆమె “బఘీరా”, “బైరతి రంగల్”, “ఏస్” వంటి సినిమాల్లో కూడా నటించింది. పెద్ద సక్సెస్ రాకపోయినా, ఈ చిత్రాలు ఆమెకు అభిమాన వర్గం పెరగడానికి దోహదం చేశాయి. ఇటీవల శివకార్తికేయన్‌తో కలిసి నటించిన “మదరాసి” చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన భారీ హిట్ “కాంతారా: చాప్టర్ 1” చిత్రంలో రుక్మిణీ పాత్ర ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఆమె నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అయ్యారు. ఈ సినిమాతో ఆమె ప్రాచుర్యం మరింతగా పెరిగింది. ఈ విజయాల తర్వాత ఆమెకు కొత్త ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రుక్మిణీ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.
ఇక సోషల్ మీడియా వేదికగా ఆమె ఇటీవల చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన పేరుతో కొందరు మోసాలు చేస్తున్నారని ఆమె పేర్కొంది. 9445893273 అనే నంబర్‌ను ఉపయోగిస్తూ, తన లా మాట్లాడి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పింది. ఆ నంబర్ తనది కాదని స్పష్టం చేస్తూ, ఎవరైనా ఆ నంబర్ నుంచి కాల్ లేదా మెసేజ్ అందుకున్నా వెంటనే దాన్ని ఫేక్‌గా గుర్తించాలని అభిమానులను కోరింది. ఇలాంటి మోసపూరిత చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
ప్రస్తుతం రుక్మిణీ వసంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. అదేవిధంగా మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన నటించబోతున్నారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఒకే సమయంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ రుక్మిణీ వసంత్ స్టార్ హీరోయిన్గా ఎదుగుతోంది.