టీడీపీ దూదేకుల/నూర్బాషా సాధికార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్, రిటైర్డ్ ఎస్పీ పి. షేక్షావలి గారు శనివారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఉన్నతాధికారిగా పోలీసు శాఖలో దశాబ్దాలపాటు విశిష్ట సేవలు అందించిన షేక్షావలి గారు, ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రజా సేవపట్ల అంకితభావాన్ని కొనసాగించారు. ప్రజల్లో సానుకూల మార్పు తేవాలనే సంకల్పంతో 2023లో నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఆయన దూదేకుల/నూర్ బాషా సాధికార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమితులై, సామాజిక వర్గ బలోపేతం కోసం విశేష కృషి చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో షేక్షావలి గారు పార్టీ విజయానికి కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని దూదేకుల, నూర్బాషా సామాజికవర్గాల్లో విస్తృతంగా పర్యటించి, టీడీపీ విధానాలు, అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండేవారు. ఆయన చేసిన కృషి వల్ల ఆ వర్గాల్లో పార్టీకి మద్దతు పెరిగినట్లు నేతలు గుర్తుచేసుకున్నారు.
పార్టీ వర్గాల ప్రకారం, షేక్షావలి గారి మృతితో దూదేకుల/నూర్ బాషా కమ్యూనిటీలో తీరని లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక మంచి అధికారి మాత్రమే కాదు, పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసిన వ్యక్తి ఆయన అని పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ షేక్షావలి గారి సేవలు పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని ట్విటర్లో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయనను గుర్తుచేసుకుంటూ తమ సంతాపాన్ని తెలిపారు.
పి. షేక్షావలి గారు సమాజానికి రాజకీయాలకు నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా అందరి మనసుల్లో నిలిచిపోయారు. ఆయన మృతి టీడీపీకి మాత్రమే కాకుండా, ప్రజా సేవను విశ్వసించే ప్రతి ఒక్కరికి బాధ కలిగించే సంఘటనగా మారింది. పార్టీ వర్గాలు త్వరలో ఆయనకు స్మారక సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.