గూగుల్ మ్యాప్స్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పలు అప్‌డేట్స్‌ను ప్రకటించింది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ఫీచర్లను రూపొందించింది. మొత్తం 10 కొత్త అప్‌డేట్స్‌తో గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా, సౌకర్యవంతంగా మారబోతోంది. ఈ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ, రహదారి భద్రత నుండి రియల్ టైమ్ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ప్రధానంగా, “జెమినీ నావిగేషన్” అనే కొత్త ఫీచర్ వినియోగదారుల డ్రైవింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చబోతోంది. వాయిస్ ఆధారిత ఈ సాంకేతికతతో, డ్రైవింగ్ సమయంలో వినియోగదారులు హ్యాండ్‌ఫ్రీగా మాట్లాడి సమాధానాలు పొందవచ్చు. ఉదాహరణకు, “దగ్గర్లోని పెట్రోల్ పంప్ ఎక్కడ?” లేదా “ఈ ప్రాంతంలో పార్కింగ్ ఉందా?” వంటి ప్రశ్నలకు మ్యాప్స్ తక్షణ సమాధానాలు ఇస్తుంది. అంతేకాక, “స్థానిక సూచనలు” ఫీచర్ ద్వారా మ్యాప్స్ వెబ్ రివ్యూలు, కంటెంట్ ఆధారంగా ప్రయోజనకరమైన సూచనలను కూడా ఇస్తుంది.
అదనంగా, ప్రమాద ప్రాంతాల దగ్గర విజువల్, ఆడియో అలర్ట్స్ ఇచ్చే వ్యవస్థను కూడా గూగుల్ ప్రవేశపెట్టింది. గూర్గ్రామ్, సైబరాబాద్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో ఈ ఫీచర్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ అధికారులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. అంతేకాకుండా, స్పీడ్ లిమిట్ డిస్‌ప్లే కూడా ఇప్పుడు ముంబై, హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో అందుబాటులో ఉంది.
ట్రాఫిక్ అప్డేట్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులు నావిగేషన్ యాప్ వాడకపోయినా కూడా రోడ్లలో డిలేలు, జామ్‌లు గురించి నోటిఫికేషన్లు పొందగలరు. ఇక NHAIతో గూగుల్ మ్యాప్స్ కొత్త భాగస్వామ్యంతో హైవే రోడ్ల మరమ్మతులు, మూసివేతలపై దాదాపు రియల్ టైమ్ సమాచారం లభిస్తుంది. రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ స్టేషన్లు, రెస్ట్ రూమ్స్ గురించి కూడా సమాచారం అందిస్తుంది.
ఇంకా, రెండు చక్రాల వాహనదారుల కోసం కస్టమైజ్‌డ్ నావిగేషన్ ఐకాన్‌లు, తొమ్మిది భారతీయ భాషల్లో వాయిస్ నావిగేషన్, గూగుల్ వాలెట్‌తో మెట్రో టికెట్ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ మార్పులు గూగుల్ మ్యాప్స్‌ను సాధారణ నావిగేషన్ యాప్‌గా కాకుండా, పూర్తి స్థాయి ప్రయాణ సహాయక వ్యవస్థగా మార్చనున్నాయి.