తిరుమల శ్రీవారి భక్తులకు మరియు ప్రయాణికులకు రైల్వే శాఖ (Railway Department) ఒక పెద్ద శుభవార్త అందించింది. విజయవాడ-బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా ప్రయాణించే మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ (Another Vande Bharat Express) త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ రైలుకు కొద్ది నెలల క్రితమే ఆమోదం దక్కినప్పటికీ, ఆలస్యం కాగా, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈ నెలాఖరు నుంచి పట్టాలెక్కేందుకు నిర్ణయించారు. ఈ కొత్త రైలు ద్వారా విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం తొమ్మిది గంటల్లోనే చేరుకోవచ్చు.
ముఖ్యంగా శ్రీవారి భక్తులు నాలుగున్నర గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే, బెంగళూరు ప్రయాణంలో ఇతర రైళ్ల కంటే మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందేభారత్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు నడవనుంది.
ఈ రైలు షెడ్యూల్ వివరాలను కూడా రైల్వే శాఖ ఖరారు చేసింది. రైలు నెంబర్ 20711 విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఉదయం 9.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
అక్కడి నుంచి చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం మీదుగా మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు (ఎస్ఎంవీటీ) చేరుకుంటుంది. అదే రోజు తిరుగు ప్రయాణంలో (ట్రైన్ నెం. 20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు స్టార్ట్ అయి, రాత్రి 6.55 గంటలకు తిరుపతికి, రాత్రి 11.45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.
మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్కార్లు, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్కార్ ఉండనున్నాయి. ఈ కొత్త వందేభారత్ రైలు సౌకర్యం తిరుపతి, బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు గొప్ప వెసులుబాటును కల్పిస్తుంది.